NTV Telugu Site icon

Karnataka Elections: “విషపు పాము” వ్యాఖ్యలు కాంగ్రెస్ కొంప ముంచుతుందా..? చివరకు ఆ పార్టీనే కాటేస్తుందా..?

Pm Modi

Pm Modi

Karnataka Elections: ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ కొంపముంచబోతున్నాయా..? అంటే బీజేపీ ఆ విధంగానే సింపతి సంపాదించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. గత అనుభవాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ పాఠాలు నేర్చుకోవడం లేదు. తాజాగా ఈ రోజు కలబురిగిలో జరిగిన ఓ సభలో ఖర్గే మాట్లాడుతూ.. ప్రధాని మోడీ విషపు పాము లాంటి వాడని, బీజేపీ పార్టీ కూడా అటువంటిదే అని వ్యాఖ్యానించాడు. అతను విషపు పామా..? కదా..? అని తెలుసుకోవాలంటే తాకి చూడాలని, అలా చేస్తే మరణమే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందిస్తోంది. దేశ ప్రధానిపై ఇలాంటి వ్యక్తిగతమైన వ్యాఖ్యలు చేస్తారా..? అంటూ మండిపడుతోంది. ప్రపంచదేశాలు గౌరవించే ప్రధానిపై దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారంటూ కేంద్ర మంత్రుల నుంచి కర్ణాటక బీజేపీ నేతల దాకా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వ్యాఖ్యలనే ప్రచార అస్త్రంగా మార్చుకుంటోంది బీజేపీ. కర్ణాటకలో బీజేపీతో పోలిస్తే ఎంతోకొంత కాంగ్రెస్ మెజారీటీ సాధింస్తుందని అన్ని ప్రీపోల్ సర్వేలు చెబుతున్న క్రమంలో ఖర్గే చేసిన ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ కు ప్రతిబంధకంగా మారాయి. కర్ణాటక ఎన్నికల్లో ఇదో మలుపు అని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య అన్నారంటే, ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ ను దెబ్బతీస్తాయని చెప్పకనే చెబుతున్నారు.

Read Also: Chrisann Pereira: టాయిలెట్ వాటర్‌తో కాఫీ.. డిటర్జెంట్ సబ్బులో జట్టు కడుక్కున్న.. జైలు కష్టాలు చెప్పిన బాలీవుడ్ నటి

గత అనుభవాలు మరిచిన కాంగ్రెస్:

గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్రమోడీపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలనే బీజేపీ ప్రచార సాధనాలుగా ఉపయోగించుకుని దెబ్బకొట్టింది. 2007లో కాంగ్రెస్ పార్టీ గుజరాత్ అల్లర్లను ఉద్దేశిస్తూ మోడీపై ‘‘మౌత్ కా సౌదాగర్’’(మరణాల వ్యాపారి) అని, 2019లో ‘‘చౌకీదార్ చోర్ హై’’ అంటూ ప్రచారం చేసింది. అయితే ఈ రెండు కూడా కాంగ్రెస్ పార్టీనే దెబ్బకొట్టాయి. ఆ విమర్శల్ని బీజేపీ తిప్పికొట్టి, ప్రజల్లో సానుభూతి వచ్చేలా చేసింది.

2014 లోక్ సభ ఎన్నికల ముందు మోడీ ప్రచారం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ ‘‘చాయ్ వాలా’’ అంటూ హేళన చేశాడు. ఆ ఎన్నికల్లో దీన్నే ప్రచారం అస్త్రంగా మార్చుకున్న బీజేపీ ‘‘చాయ్ పే చర్చ’’ పేరుతో ప్రచారాన్ని నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి అధికారంలోకి వచ్చింది.

2017 గుజరాత్ ఎన్నికల ముందు ఇదే మణిశంకర్ అయ్యర్ మరోసారి మోడీని ఉద్దేశిస్తూ ‘‘నీచ్ ఆద్మీ’’ అంటూ పిలిచాడు. దీన్ని కుల వివక్షగా మార్చి బీజేపీ ఆ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించింది. 2019 ఎన్నికల ముందు రాహుల్ గాంధీ మోడీకి వ్యతిరేకంగా ‘‘చౌకీదార్ చోర్ హై’’ అంటూ కామెంట్స్ చేశాడు. దీనికి విరుగుడుగా బీజేపీ ‘‘మే బీ చౌకీదార్’’ అంటూ ప్రచారం నిర్వహించి మరోసారి కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేసింది. 2022 గుజరాత్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేత ఖర్గే మోడీని ‘‘రావణుడి’’తో పోల్చాడు. ఇది కూడా బీజేపీకి లాభించింది గుజరాత్ ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రస్తుతం ఖర్గే తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పినా.. బీజేపీ చేయాల్సిందంతా చేసేసింది.

Show comments