UP BJP: గత రెండు పర్యాయాలుగా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి అత్యధిక ఎంపీ స్థానాలు (80) ఉన్న ఉత్తర్ ప్రదేశ్ కీలకంగా మారింది. అయితే, 2024 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం యూపీలో బీజేపీ చతికిలపడింది. బీజేపీతో పోలిస్తే, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)-కాంగ్రెస్‌లు కలిసి మెరుగైన ఫలితాలు సాధించాయి. మొత్తం 80 స్థానాల్లో ఇండియా కూటమి 43 స్థానాలను కైవసం చేసుకోగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కేవలం 36 సీట్లతో సరిపెట్టుకుంది. 2019లో బీజేపీకి 64 సీట్లు వచ్చాయి. అయోధ్య రామమందిరం ఉన్న ఫైజాబాద్‌లో కూడా బీజేపీ ఓడిపోవడం ఆ పార్టీని నిరాశకు గురిచేసింది.
అయితే, ఈ పరాజయంపై పార్టీ 15 పేజీల సమగ్ర విశ్లేషణ సమర్పించింది. పార్టీ తీరును అంచనా వేయడానికి 40,000 మంది నుంచి అభిప్రాయాలను సేకరించినట్లు తెలిసింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల్లో బీజేపీ ఓట్ల శాతంలో 8 శాతం తగ్గినట్లు నివేదికలు చెప్పాయి. ఇటీవల జరిగిన బీజేపీ కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ.. పార్టీ ఓటమికి ‘అతి విశ్వాసం’ కారణమని చెప్పారు. మరోవైపు యోగికి డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యతో పాటు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
యూపీలో ఓటమికి పార్టీ 6 కారణాలను ప్రస్తావించింది. అధికారుల పాలన, పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి, తరుచూ పేపర్ లీకులు, కుర్మీ – మౌర్య వర్గాల నుంచి తగ్గిన మద్దతు, ప్రభుత్వ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఉద్యోగులతో భర్తీ, రిజర్వేషన్లపై ప్రతిపక్షాల కథనాలు ఇలా బీజేపీ ఓటమికి కారణమైనట్లు పార్టీ నివేదించింది.
Read Also: Janhvi Kapoor: జాన్వీ కపూర్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
కుర్మీ, మౌర్య వర్గాల నుంచి బీజేపీకి మద్దతు తగ్గడం, దళితులు ఓట్ల తగ్గింపు ఎన్నికల్లో ఫలితాల మార్పుకు కారణమైందని, దీంతో పాటు మయావతి బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) ఓట్ల శాతం తగ్గడం, కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ మెరుగైన పనితీరు ఇతర కారణాలుగా ప్రస్తావించింది. బీజేపీ తన విభేదాలను వెంటనే పరిష్కరించుకోవాలని, ఉన్నత కులం మరియు వెనకబడి కులాలు వివాదంగా మారకుండా నిరోధించడానికి అట్టడుగు స్థాయిలో పనిని ప్రారంభించాలని బీజేపీ రిపోర్టు పేర్కొంది.
ఓబీసీ పార్టీగా పేరున్న బీజేపీ, 2014, 2019 ఎంపీ ఎన్నికలతో పాటు 2019, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటింది. కుర్మీ మరియు మౌర్య కులాలు ఈసారి బిజెపికి దూరమయ్యాయని, ఆ పార్టీ దళితుల ఓట్లలో మూడింట ఒక వంతు మాత్రమే సాధించగలిగిందని నివేదిక సూచిస్తుంది. బిఎస్‌పి ఓట్ల శాతం 10 శాతం తగ్గిందని, కాంగ్రెస్ తన స్థాయిని మెరుగుపరుచుకున్నదని రిపోర్ట్ హైలెట్ చేసింది.
దీనికి తోడు త్వరగా టిక్కెట్లు ఇచ్చి, ఎన్నికలకు చాలా ముందు కార్యకర్తలు ప్రచారంలో దిగడం, అసలు సమయంలో నీరసించడం కూడా ఓ కారణంగా పార్టీ నివేదిక పేర్కొంది. ఆరు-ఏడు దశల్లోకి వచ్చే సరికి కార్యకర్తల్లో అలసట ఆవిరించిందని చెప్పింది. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు కూడా వ్యతిరేకమయ్యాయి. అగ్నివీర్, పేపర్ లీకులు యువత ఆందోళనల్ని ప్రతిధ్వనించాయని నివేదిక తెలిపింది.