August 15: ఆగస్టు 15, భారతదేశానికి బ్రిటీష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం లభించిన తేదీ. ఎన్నో ఉద్యమాల తర్వాత 1947 ఇదే తేదీన మన భారతీయ పతాకం సగౌరవంగా రెపరెపలాడింది. ఈ తేదీ ఒక్క మనదేశానికే కాకుండా ఉపఖండంలోని పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లో కూడా ప్రముఖమైన తేదీగా ఉంది.
బంగ్లాదేశ్:
బంగ్లాదేశ్ జాతిపిత, మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మన్‌ని ఆగస్టు 15, 1975 రోజు సైన్యం తిరుగుబాటు చేసి చంపేసింది. ఆగస్టు 15ని ఆ దేశం ‘‘సంతాప దినం’’గా జరుపుకుంటుంది. అయితే, రిజర్వేషన్ కోటా ఉద్యమం కారణంగా షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి, ఇండియా వచ్చేసింది. ఆమె బంగబంధు ముజిబుర్ రెహ్మాన్ హత్య దినోత్సవం రోజుని సంతాప దినంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
పాకిస్తాన్‌లో ఒకప్పుడు అంతర్భాగంగా ఉన్న బంగ్లాదేశ్, ముజిబుర్ రెహ్మాన్ పోరాట ఫలితంగా 1971లో ఇండియా సాయంతో స్వాతంత్య్రాన్ని సంపాదించుకుంది. 1975లో ఆరుగురు మిడ్-ర్యాంకింగ్ ఆర్మీ అధికారులు కొంత మంది సైనికులతో కలిసి ఆయనపై తిరుగుబాటు చేసి హతం చేశారు. యాదృచ్ఛికంగా, హసీనా ప్రత్యర్థి మరియు బంగ్లాదేశ్ సైనిక పాలకుడు జియావుర్ రెహమాన్ భార్య ఖలీదా జియా ఆగస్టు 15న జన్మించింది.
ఆఫ్ఘనిస్తాన్:
అమెరికా సాయంతో ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజాస్వామ్యం నెలకొంది. అమెరికా సేనలు ఆఫ్ఘాన్ విడిచి వెళ్లడంతో మరోసారి ఆ ప్రాంతంలో తాలిబాన్ రాజ్యం ఏర్పడింది. ఆగస్టు 15, 2021లో కాబూల్‌లో తాలిబాన్ పాలకులు అధికారాన్ని చేపట్టారు. ఆఫ్ఘన్ ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనీ దేశాన్ని విడిచిపారిపోవడంతో ఆ దేశం తాలిబాన్ పాలనలోకి వెళ్లింది.
పాకిస్తాన్:
పాకిస్తాన్‌కి కూడా ఆగస్టు 15తో సంబంధం ఉంది. ఒక రోజు తేడాతో మత ప్రాతిపదిక విడిపోయి స్వాతంత్య్రం పొందిన భారత్-పాక్‌లు ఈ తేదీని గుర్తుంచుకుంటాయి. దేశ విభజన 1947లో తీవ్రమైన వలసలు, మత కలహాలకు కారణమైంది. పాకిస్తాన్‌లోని మతోన్మాద మూకలు హిందువులు, సిక్కులని ఊచకోత కోశాయి.
ఇదే కాకుండు ఆగస్టు 15న తాలిబాన్‌లు ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారంలోకి రావడంపై ఎక్కువగా సంతోషించిన దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్. అయితే, ఇప్పుడు మాత్రం తీవ్రంగా బాధపడుతోంది. పాకిస్తాన్ తాలిబాన్లు, ఆఫ్ఘనిస్తాన్ అండతో పాకిస్తాన్‌లో దాడులకు తెగబడుతున్నారు. ముఖ్యంగా ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో దాడులకు పాల్పడుతున్నారు.
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ..‘‘ బానిస సంకెళ్లు తెగిపోయాయి’’ అని కామెంట్ చేశారు. అయితే, కొద్దికాలానే తాలిబాన్ పాలకు పాకిస్తాన్‌కి చుక్కులు చూపిస్తు్న్నారు. ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఎప్పటి నుంచో నడుస్తోంది. డ్యూరాండ్ లైన్‌ని ఆఫ్ఘనిస్తాన్ ఒప్పుకోవడం లేదు. ఇరు వర్గాల మధ్య ఈ ప్రాంతంతో దాడులు జరుగుతున్నాయి. దీంతో పాకిస్తాన్‌కి అప్పటి ప్రజాస్వామ్య పాలనే బాగుండేదనే భావన కలుగుతోంది.