Maharashtra CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఏక్‌నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీల ‘‘మహాయుతి’’ కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 288 స్థానాలకు గానూ కూటమి 233 సీట్లను కైవసం చేసుకుంది. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి కేవలం 49 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. మహాయుతి కూటమిలో బీజేపీ ఏకంగా 132 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ కూటమి దాటికి ప్రతిపక్షంలోని కాంగ్రెస్, ఉద్ధవ్ సేన, శరద్ పవార్ ఎన్సీపీలకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు.
Read Also: Space Out Competition: 90 నిమిషాలపాటు ‘ఏమి చేయవద్దు’.. బహుమతి గెలుచుకోండి
ఇదిలా ఉంటే, ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరిస్తుందా..? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. మహాయుతిలోని మూడు పార్టీలు కూడా తమ తమ శాసనసభా పక్ష నేతలను ఎన్నుకుంటున్నాయి. మూడు పార్టీలు కూడా వేర్వేరుగా సమావేశమయ్యాయి. ముంబైలోని తన అధికారిక నివాసంలో జరిగిన సమావేశంలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ తన పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యారు. ముంబైలోని దేవేంద్ర ఫడ్నవీస్ అధికారిక నివాసంలో బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరగనుండగా, బాంద్రాలోని ఓ హోటల్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో ఏక్నాథ్ షిండే సమావేశమయ్యారు.
ఈ ప్రత్యేక పార్టీ సమావేశాల తర్వాత, సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఎంపికపై చర్చించడానికి మహాయుతి ఎమ్మెల్యేలంతా కూటమిగా సమావేశం నిర్వహించనున్నారు. ప్రస్తుతం అత్యధిక సీట్లు సాధించిన బీజేపీ దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి రేసులో ముందున్నారు. మరోవైపు ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే కూడా సీఎం పోస్టుని ఆశిస్తున్నారు. ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతలతో సంప్రదింపులు జరిపి ముఖ్యమంత్రి పదవికి నిర్ణంయ తీసుకుంటారని విశ్వసనీయ సమాచారం. 10 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేసిన ముంబైలోని వాంఖడే స్టేడియంలో మంగళవారం నవంబర్ 26న ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు.