NTV Telugu Site icon

Hardeep Singh Nijjar: హర్దీప్ సింగ్ నిజ్జర్ ఎవరు..? ఇతని హత్య ఇండియా-కెనడాల మధ్య ఎందుకు చిచ్చు పెట్టింది..?

Hardeep Singh Nijjar

Hardeep Singh Nijjar

Hardeep Singh Nijjar: ఓ ఖలిస్తానీ హత్య ఇండియా-కెనడా సంబంధాల మధ్య చిచ్చు పెట్టింది. హర్దీప్ సింగ్ నిజ్జర్ అనే ఖలిస్తానీ ఉగ్రవాదిని జూన్ నెలలో కెనడాలోని సర్రేలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ హత్య అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాల్లో నివురుగప్పిన నిప్పులా ఉంది. తాజాగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంట్ లో మాట్లాడుతూ.. నిజ్జర్ హత్య భారత ఎజెంట్లే కారణం అని నిందించాడు. ఇంతే కాకుండా భారత అగ్రశ్రేణి దౌత్యవేత్తను కెనడా నుంచి బహిష్కరిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామం ఇరుదేశాల మధ్య దౌత్య పరమైన ఉద్రిక్తతతకు కారణమైంది.

హర్దీప్ సింగ్ నిజ్జర్ ఎవరు..?

హర్దీప్ సింగ్ నిజ్జర్ కరడుగట్టిన ఓ ఖలిస్తానీ వేర్పాటువాది. భారత్ నుంచి పంజాబ్ రాష్ట్రాన్ని వేరుచేసి మరోదేశం ఏర్పాటు చేయాలని కోరుకున్నాడు. 2020లో భారత్ ఇతడిని ఉగ్రవాదిగా గుర్తించింది. ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(KTF) పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. 1990ల చివర్లో అతను కెనడాకు వెళ్లాడు. తన ఉగ్రసంస్థ కోసం యువకులకు శిక్షణనిచ్చి, రిక్రూట్ చేసుకోవడం ప్రారంభించాడు. నిజ్జర్ ఉగ్రవాద సంస్థ అయిన ‘సిక్ ఫర్ జస్టిస్’, దాని చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూలో సంబంధాలు ఉన్నాయి. ఈ సంస్థే కెనడాలో ఖలిస్తాన్ రెఫరెండానికి పిలుపునిచ్చింది.

గతంలో పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్న అమరీందర్ సింగ్, కెనడా ప్రధానికి నిజ్జర్ పేరుతో పాటు మరికొంతమంది వాంటెడ్ వ్యక్తుల లిస్టును అందించాడు. పంజాబ్ రాష్ట్రంలో తీవ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నాడని అతడిని అప్పటించాలని 2022లో భారత్ కోరింది.

2007లో లూథియానాలో జరిగిన పేలుళ్లలో నిజ్జర్ పాత్ర ఉంది. ఇందులో ఆరుగురు మరణించగా.. 42 మంది గాయపడ్డారు. 2010లో పాటియాలాలో ఓ దేవాలయంపై దాడికి పాల్పడ్డాడు. 2015లో హిందూ నాయకులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలని ప్లాన్ చేశాడు. 2015, 2016లో నిజ్జర్ పై లుక్ అవుట్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయబడ్డాయి. 2018లో పంజాబ్ ఆర్ఎస్ఎస్ నేతల హత్యలో నిజ్జర్ ప్రమేయం ఉంది. 2022లో జలంధర్ లో హిందూ పూజారి హత్యకు కుట్ర పన్నాడు. దీంతో ఎన్ఐఏ ఇతడిపై రూ. 10 లక్షల రివార్డు ప్రకటించింది.

Read Also: Women’s Reservation Bill: మహిళా బిల్లును స్వాగతించిన కాంగ్రెస్.. పీఎం మోడీకి రాహుల్ గాంధీ రాసిన పాత లేఖ వైరల్..

నిజ్జర్ హత్యతో కలకలం:

ఈ ఏడాది జూన్ 18న హర్దీప్ సింగ్ నిజ్జర్ ని సర్రే నగరంలో గుర్తు తెలియని వ్యక్తుల కాల్చి చంపారు. ఇదే సమయంలో పాకిస్తాన్, యూకే దేశాల్లో కూడా పలువురు ఖలిస్తానీ నేతలు చంపబడ్డారు. అయితే వీటన్నింటి వెనక భారత గూఢచార సంస్థ రా ఉందని పలువురు ఖలిస్తానీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు కెనడా ప్రభుత్వం ఏకంగా భారత దౌత్యవేత్తనే బహిష్కరించే స్థాయికి వెళ్లింది. ఈ హత్య తరువాత ఖలిస్తానీ నేతలు అండర్ గ్రౌండ్ కు వెళ్లారు. ఇప్పుడిప్పుడే అంతా బయటకు వస్తున్నారు. కెనడా మేజర్ లాబీగా ఉన్న సిక్కు కమ్యూనిటీ అక్కడి ప్రభుత్వంపై ఒత్తిడి పెడుతున్నట్లు తెలుస్తోంది.