Lalu Yadav: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బీహార్‌లో కేవలం 25 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. ఆర్జేడీ, కాంగ్రెస్‌ల ‘‘మహాఘట్బంధన్’’ కూటమి మొత్తంగా 35 స్థానాలే దక్కించుకున్నాయి. మరోవైపు, బీజేపీ,జేడీయూల ఎన్డీయే కూటమి 202 స్థానాలు గెలిచి తిరుగులేని విజయాన్ని దక్కించుకుంది. అయితే, ఈ ఓటమి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో చిచ్చుపెట్టింది. శనివారం, లాలూ కుమార్తె రోహిణి ఆచార్య రాజకీయాలకు గుడ్ బై చెప్పింది. తన ఫ్యామిలీతో సంబంధాలు లేవని ప్రకటించింది. ఆర్జేడీ ఎంపీ సంజయ్ యాదవ్, రమీజ్ నేమత్ ఖాన్ వల్లే ఫ్యామిలీకి దూరమైనట్లు చెప్పింది.
అయితే, ఇప్పుడు అందరి చూపు ఈ రమీజ్ ఎవరనే దానిపై నెలకొంది. మీడియాలో కానీ, బీహార్ రాజకీయాల్లో కానీ పెద్దగా పరిచయం లేని పేరు కావడంతో ప్రజలంతా ఈయన ఎవరనే దానిపై ఆసక్తిగా ఉన్నారు. ఆర్జేడీ నేత, లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్‌కు స్నేహితుడు. అతడి ప్రధాన బృందంలో ఒకరు. వీరిద్దరి స్నేహం క్రికెట్ నుంచి రాజకీయాల వరకు విస్తరించింది. రమీజ్, తేజస్వీ పార్టీ సోషల్ మీడియా, క్యాంపెయిన్ టీమ్‌లను పర్యవేక్షిస్తాడని ఆర్జేడీ వర్గాలు చెబుతున్నాయి
Read Also: CV Anand: “దమ్ముంటే నన్ను పట్టుకోండి” అన్నోడిని పట్టుకున్నారు.. సీవీ ఆనంద్ సంచలన ట్వీట్..
ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన వ్యక్తి బలరాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసిన మాజీ ఎంపీ రిజ్వాన్ జహీర్ అల్లుడు. రమీజ్ మామ సమాజ్‌వాదీ(ఎస్పీ) నుంచి రెండు సార్లు ఎంపీగా, మాయవతి బీఎస్సీ నుంచి ఒకసారి పోటీ చేశారు. రిజ్వాన్ జహీర్ ఒకానోక సమయంలో యూపీలో అత్యంత పిన్న వయస్కుడైన ఎమ్మెల్యేగా ఉన్నారు. రమీజ్ భార్య జెబా రిజ్వాన్ తులసీపూర్ స్థానం నుంచి పోటీ చేసింది, ఆమె రెండుసార్లు కూడా ఓడిపోయింది. 2021లో తులసీపూర్ లో జరిగి జిల్లా పంచాయతీ ఎన్నికల సమయంలో చెలరేగిన హింసలో రమీజ్ పాత్ర ఉందనే ఆరోపణలపై కేసు ఎదుర్కొంటున్నాడు.
2022లో తులసిపూర్ నగర్ పంచాయతీ మాజీ అధ్యక్షుడు ఫిరోజ్ పప్పు హత్య కేసులో కుట్ర పన్నారనే ఆరోపణలపై రమీజ్ నేమత్ ఖాన్, అతని భార్య, మామ రిజ్వాన్ జహీర్, మరో ముగ్గురిని అరెస్టు చేయబడ్డారు.2023లో ప్రతాప్ గఢ్ కాంట్రాక్టర్ షకీల్ ఖాన్ హత్యలో కూడా అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. అదే ఏడాది రమీజ్ ఖాన్ పేరుతో కొనుగోలు చేసిన రూ. 4.75 కోట్ల విలువైన భూమిని యూపీ ప్రభుత్వం స్వాధీనం చేసకుంది. 2024లో గ్యాంగ్‌స్టర్స్ చట్టం కింద అతడిని యోగి సర్కార్ అరెస్ట్ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ లో బెయిల్‌పై బయటకు వచ్చాడు.
రమీజ్ తండ్రి నెమతుల్లా ఖాన్ జామియా మిలియా ఇస్లామియాలో ప్రొఫెసర్. రమీజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదివాడు. ఆ తర్వాత జామియా నుంచి బీఏ, ఎంబీఏ డిగ్రీలు పొందాడు. ఇతను మంచి క్రికెటర్. ఢిల్లీ, జార్ఖండ్ రాష్ట్రాలకు అడాడు. 2008-09 జార్ఖండ్ అండర్ -22 జట్టుకు నాయకత్వం వహించాడు. ఆ సమయంలోనే తేజస్వీ యాదవ్‌తో పరిచయం, స్నేహంగా మారింది. 2016లో ఆర్జేడీ పార్టీలో చేరాడు. అప్పటి నుంచి తేజస్వీ వెంటే ఉంటున్నాడు.
