NTV Telugu Site icon

Nirmala Sitharaman: రాహుల్ గాంధీ ఎక్కడ..? తమిళనాడు కల్తీ మద్యం మరణాలపై కాంగ్రెస్ మౌనం ఎందుకు ..?

Nirmala Sitaraman

Nirmala Sitaraman

Kallakurichi hooch tragedy: తమిళనాడు కళ్లకురిచి జిల్లాలో కల్తీ మద్యం కాటుకు 50 మందికి పైగా ప్రజలు మరణించారు. ఈ విషాద ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సీఎం స్టాలిన్ ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలు స్టాలిన్ రాజీనామా కోసం డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై తమిళనాడు ప్రభుత్వం న్యాయవిచారణకు ఆదేశించింది. అయితే, ఈ ఘటనపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ధ్వజమెత్తారు.

ఇంతపెద్ద సంఘటన జరిగినా కూడా రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 200 మందికి పైగా ప్రజల పరిస్థితి విషమంగా ఉంది. 56 మంది చనిపోయారు. వీరిలో ఎక్కువ షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారే ఉన్నారు. ఈ ఘటనను ఖండిస్తున్నారు. ‘టాస్మాక్’ అని పేరుతో ప్రభుత్వం నడుపుతున్న దుకాణాల నుంచి లైసెన్సులు పొందిన మద్యం దుకాణాల మందుతాగి వారు చనిపోయిన ఘటనపై కాంగ్రెస్ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విస్మయానికి గురిచేస్తోంది..’’ అని ఆమె అన్నారు.

Read Also: Blackmail: సోషల్ మీడియాలో స్నేహం.. బ్లాక్ మెయిల్ చేస్తూ ఏడాదిన్నరగా యువతిపై అత్యాచారం

కళ్లకురిచిలో కెమికల్ ఆధారిత కల్తీ మద్యం తయారుచేస్తున్నారని, కాంగ్రెన్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారు..? అని ప్రశ్నించారు. కల్తీ మద్యంతో దళితులు చనిపోతున్నా రాహుల్ గాంధీ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదని, ఈ మొత్తం వ్యవహారాన్ని సీబీఐ విచారణకు అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు. తమిళనాడులో ఇండియా కూటమిలో భాగంగా డీఎంకే, కాంగ్రెస్ పొత్తులో ఉన్నాయి. ఈ విషయంలో నోరు మొదపని ఇండియా కూటమి నేతలు కనీసం పార్లమెంట్‌లోని గాంధీ విగ్రహం వద్ద మరణించిన వారి పట్ల గౌరవంగా మౌనం కూడా పాటించలేదని బీజేపీ మండిపడింది.

‘‘ 56 మంది చనిపోయారు. చాలా మంది క్రిటికల్‌గా ఉన్నారు. చనిపోయిన వారిలో 40 మందికి పైగా దళితులే ఉన్నారని, ఇది ప్రభుత్వం చేసిన హత్య. ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, సోనియా గాంధీ, డీఎంకే నేతలు, ఇండియా కూటమి పార్టీలు దీనిపై మౌనంగా ఉండటం నాకు ఆశ్చర్యం కలిగించింది’’ అని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర అన్నారు. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం ఈ దుర్ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించింది. మద్రాసు హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి గోకుల్‌దాస్ నేతృత్వంలో విచారణ జరిపి మూడు నెలల్లో నివేదిక సమర్పించనున్నారు.

Show comments