Site icon NTV Telugu

Giorgia Meloni: నేను, మోడీ, ట్రంప్ మాట్లాడితే ప్రజాస్వామ్యానికి ముప్పా.? వామపక్షాలపై మెలోనీ తీవ్ర ఆగ్రహం..

Meloni

Meloni

Giorgia Meloni: ప్రపంచ వామపక్ష రాజకీయ నాయకులపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనలాంటి నాయకులు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, అర్జెంటీనా ప్రెసిడెంట్ జేవియర్ మిలీ వంటి కొత్త ప్రపంచ సంప్రదాయవాద ఉద్యమాన్ని సృష్టిస్తున్నారని, నాయకత్వం వహిస్తున్నారని ఆమె అన్నారు. ఈ జాతీయ నాయకులు జాతీయ ప్రయోజనాల గురించి, వారి దేశ సరిహద్దులను రక్షించుకోవడం గురించి మాట్లాడితే కొందరు దీనిని ప్రజాస్వామ్యానికి ముప్పుగా పిలుస్తున్నారని అన్నారు. జాతీయవాద నాయకులపై వామపక్ష నాయకులు తరుచుగా చేసే విమర్శలను ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని మెలోని చెప్పారు.

Read Also: Teacher Harassment: ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిపై ఉపాధ్యాయుడి దాడి..

జాతీయవాద నాయకులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్యల్ని ఎదుర్కొంటున్నారని, దీంతో లెఫ్ట్ లిబరల్స్ ఆందోళన చెందుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. ‘‘90లో బిల్ క్లింటన్(అమెరికా ప్రెసిడెంట్), టోనీ బ్లేయర్(యూకే పీఎం) ప్రపంచ వామపక్ష ఉదారవాద నెట్‌వర్క్‌ను సృష్టించినప్పుడు, వారిని రాజనీతిజ్ఞులు అని పిలిచేవారు. నేడు, ట్రంప్, మెలోని, మిలీ లేదా బహుశా మోడీ మాట్లాడినప్పుడు, వారిని ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిగణిస్తున్నారు. ఇది వామపక్షాల ద్వంద్వ ప్రమాణాలు’’ అని ఆదివారం వాషింగ్టన్ డీసీలో జరిగిన కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్‌లో వర్చువల్‌గా ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

యూరప్‌లోని ఇతర దేశాలతో పాటు ఇటలీలో అక్రమ వలసదారుల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో, మెలోనీ తరుచుగా తన ఆందోళనల్ని వ్యక్తం చేస్తోంది. ఈ వలసల ముప్పుని ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. వామపక్ష ఉదారవాదులు మోడీ, ట్రంప్ లాంటి నాయకులపై ఎంత బురద జల్లినా కూడా ప్రజలు వారికే ఓటు వేస్తున్నారని మెలోనీ చెప్పారు. మేము స్వేచ్ఛని కాపాడుకుంటామని, మా దేశాన్ని ప్రేమిస్తామని, సురక్షితమైన సరిహద్దుల్ని కోరుకుంటున్నామని మెలోనీ అన్నారు.

Exit mobile version