Rahul Gandhi: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘనపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. సంఘటన జరిగిన సమయంలో బీజేపీ ఎంపీలు త్వరగా తప్పించుకున్నారని అన్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన ప్రతిపక్ష ఇండియా కూటమి నిరసనల్లో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కొంతమంది యువకులు పార్లమెంట్‌లోకి దూరి పొగ విడుదల చేశారని.. బీజేపీ ఎంపీలు వెనక్కి తగ్గారని అన్నారు. బీజేపీ ఎంపీలు పారిపోయారు, ఉంకీ హవా నికల్ గయీ(వారు గట్టిగా భయపడిపోయారు)” అని రాహుల్ ఎద్దేవా చేశారు.
ఈ సంఘటనకు కారణం నిరుద్యోగమే అని రాహుల్ గాంధీ అన్నారు. 2001 పార్లమెంట్ ఉగ్రదాడి జరిగిన డిసెంబర్ 13 రోజునే నిందితులు పార్లమెంట్ భద్రతను ఉల్లంఘించారు. ఇద్దరు వ్యక్తులు విజిటర్ పాసుల సాయంతో పార్లమెంట్లోకి చేరి, సభ జరుగుతున్న సమయంలో పొగ డబ్బాలను పేల్చారు. మరో ఇద్దరు నిందితులు పార్లమెంట్ వెలుపల ఇదే విధంగా చేశారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Read Also: High Court: “నలుపు రంగులో ఉందని భార్యకు విడాకులు”.. ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
అయితే, ఈ వ్యవహారంపై చర్చించాలని, కేంద్ర హోంమంత్రి సమాధానం చెప్పాలని ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్‌లో డిమాండ్ చేస్తూ, సభకు అడ్డుతగిలారు. దీంతో ఉభయసభల స్పీకర్లు ఏకంగా 146 మంది ప్రతిపక్ష ఎంపీలను సభను నుంచి సస్పెండ్ చేశారు. దీనిపై ప్రతిపక్ష పార్టీలు నిరసన తెలుపుతున్నాయి.
ఈ రోజు జంతర్ మంతర్ వద్ద ‘సేవ్ డెమోక్రసీ’ పేరుతో ఇండియా బ్లాక్‌కు చెందిన నాయకులు నిరసన ప్రదర్శన చేస్తున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా 146 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేసేందుకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సీపీఐ(ఎం)కి చెందిన సీతారాం ఏచూరితో సహా ప్రముఖ ప్రతిపక్ష నాయకులు సమావేశమయ్యారు.
