NTV Telugu Site icon

CDS: “ప్రజల డబ్బును బలవంతంగా డిపాజిట్ చేయించిన కాంగ్రెస్”.. ఆ చట్టం ఏంటీ, ఇప్పుడు బీజేపీ ఎందుకు విమర్శిస్తోంది..

Cds

Cds

CDS: రాహుల్ గాంధీ చేసిన ‘‘సందప పునర్విభజన’’ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ రచ్చకు దారితీశాయి. బీజేపీతో పాటు ప్రధాని నరేంద్రమోడీ ఈ వ్యాఖ్యల్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అయితే, వివాదం మరింత ముదరడంతో కాంగ్రెస్ దీనిని అరికట్టే ప్రయత్నం చేస్తోంది. తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెబుతోంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తమ సంపాదించుకున్న సంపదను ‘‘చొరబాటుదారులకు’’ ఇచ్చేందుకు ప్రయత్నం జరుగుతోందని, వారు మన తల్లులు, సోదరీమణుల మంగళసూత్రాలను కూడా కాంగ్రెస్ వదలదని ప్రధాని మోడీ ఇటీవల రాజస్తాన్ ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. మరోవైపు కాంగ్రెస్ ఓవర్సీస్ అధ్యక్షుడిగా ఉన్న శ్యామ్ పిట్రోడా ‘‘వారసత్వ పన్ను’’పై వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్‌ని మరింత ఇరకాటంలో పడేసింది.

ఇదిలా ఉంటే గతంలో కాంగ్రెస్ చేసిన చట్టాలను గురించి బీజేపీ ఇప్పుడు వైరల్ చేస్తోంది. 1963, 1974లో పన్నుచెల్లింపుదారుల సంపదను దాదాపుగా 5 ఏళ్ల పాటు నిర్భందంగా కాంగ్రెస్ ప్రభుత్వం డిపాజిట్ చేయించిన విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ కాలంలో కంపల్సరీ డిపాజిట్ స్కీమ్(సీడీఎస్) గురించి బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఎన్నికల వేళ కాంగ్రెస్ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు అయింది.

60, 70ల్లో కాంగ్రెస్ తీసుకువచ్చిన ఈ పథకం ద్వారా మీరు కష్టపడి సంపాదించిన డబ్బును 5 ఏళ్ల పాటు కోల్పోవాల్సి వచ్చింది. ఈ పథకం ద్వారా పన్ను చెల్లింపుదారులు 3 నుంచి 5 ఏళ్ల పాటు డిపాజిట్ చేసేలా కాంగ్రెస్ చట్టం చేసింది. కంపల్సరీ డిపాజిట్ స్కీమ్ (CDS)గా పిలువబడే ఈ చట్టం “జాతీయ ఆర్థికాభివృద్ధి ప్రయోజనాల కోసం” అమలు చేయబడిందని చెప్పింది.

Read Also: Aavesham :100 కోట్ల క్లబ్‌లోకి మరో మలయాళ సినిమా.. ఫహద్ ‘ఆవేశం’ తగ్గేదేలే!

కంపల్సరీ డిపాజిట్ స్కీమ్ అంటే ఏమిటి?

కంపల్సరీ డిపాజిట్ స్కీమ్ బిల్లును తొలిసారిగా 1963లో అప్పటి ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ కేంద్ర బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. 1962లో భారతదేశం-చైనా యుద్ధం సమయంలో మొదటి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన తర్వాత ఈ చట్టం తీసుకురాబడింది. మరోసారి ఎమర్జెన్సీ పరిస్థితుల్లో తీసుకురాబడింది. ఈ పథకం దేశంలో పొదుపు అలవాటును పెంచడానికి సాయం చేస్తుందని ‘‘తక్షణ డిమాండ్’’ని నియంత్రిస్తుందని మొరార్జీ దేశాయ్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, పన్ను చెల్లింపుదారులు మరియు ఆస్తి యజమానులతో సహా భారతదేశం మొత్తానికి ఈ పథకం వర్తిస్తుంది. డిపాజిట్లు సంవత్సరానికి 4% వడ్డీ రేటును కలిగి ఉంటాయి. 5 ఏళ్ల తర్వాత తిరిగి చెల్లించబడుతాయి.

ఉదాహరణకు వ్యక్తులు భూమి వినియోగం ద్వారా వచ్చే ఆదాయంలో 50 శాతం డిపాజిట్ చేయాలి. పట్టణ ప్రాంతాల్లో స్థిరాస్తులు కలిగి ఉన్నవారు ఆస్తి వార్షిక అద్దె విలువలో 3 శాతం డిపాజిట్ చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ వార్షిక ఆదాయంలో 3 శాతం జీతాల నుంచి డిపాజిట్ చేయాలి. రూ. 6000 లేదా అంతకన్నా తక్కువ పన్ను చెల్లింపుదారులకు కూడా ఇదే రేటు ఉంటుంది. డిపాజిట్లు చేయడంలో విఫలమైన వారిపై భారీ జరిమానాలు కూడా విధించారు. 1963 తర్వాత 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించడానికి ఒక ఏడాది ముందు ఈ చట్టం మళ్లీ అమలులోకి వచ్చింది. ఆ సమయంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా ఉన్నారు.

ఈ చట్టం 28.69 శాతం ఆల్-టైమ్ హై ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో వచ్చింది. దీనిని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. భారత్-పాక్ మధ్య 1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాట ప్రభావాలు అప్పటి ఆర్థిక వ్యవస్థపై కనిపించాయి. 1974 చట్టం ప్రకారం.. డిపాజిట్ రేట్లు 4-18 శాతం మధ్య నిర్ణయించబడ్డాయి. వ్యవసాయ ఆదాయానికి కూడా ఈ పథకాన్ని వర్తింపచేశారు. రూ.15,000 నుంచి రూ.25,000 మధ్య ఆదాయం ఉన్నవారు తమ ప్రస్తుత ఆదాయంలో 4 శాతాన్ని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. రూ.70,000 కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు రూ.70,000 దాటిన మొత్తంలో 18% కలిపి రూ.7,100 డిపాజిట్ చేయాలి. చెల్లింపు చేయడంలో విఫలమైతే తప్పనిసరి డిపాజిట్‌లో 25% జరిమానా విధించబడుతుంది. 1984 లోక్‌సభ ఎన్నికల ముందు ఈ పథకాన్ని రద్దు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.