Sim binding: సిమ్ లేకుండా, అదే నెంబర్‌తో వాట్సాప్ ఉపయోగిస్తున్నారా? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్లే. జనవరి 1, 2027 నుంచి ‘‘సిమ్ బైండింగ్’’ అనే కొత్త నిబంధన రాబోతోంది. దీని వల్ల మొబైల్‌లో సిమ్ ఉండీ, దాని నెంబర్‌లో లింక్ అయితేనే వాట్సాప్ పనిచేస్తుంది. ఏ నంబర్‌లో వాట్సాప్ వాడుతున్నారు, ఆ సిమ్ తప్పనిసరిగా ఫోన్‌లో ఉండాలి. ఒక వేళ ఫోన్ నుంచి సిమ్ తీసేస్తే పనిచేయదు. సైబర్ మోసాలు, నకిలీ అకౌంట్లను అరికట్టడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) ఆదేశాల ప్రకారం.. వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి యాప్ అకౌంట్‌కు ఏ మొబైల్ నెంబర్‌పై యాక్టివేట్ అయి ఉంటుందో ఆ సిమ్ ఫోన్‌లోనే ఉండాలి. ప్రస్తుతం ఒకసారి OTP ద్వారా అకౌంట్‌ను ధ్రువీకరించుకున్న తర్వాత, సిమ్ వేరే ఫోన్‌లోకి మార్చినా లేదా తొలగించినా, వైఫై ద్వారా కొన్ని పరికరాల్లో మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించుకోవచ్చు.
సిమ్ బైండింగ్ అంటే, ఏ యాప్‌లపై ప్రభావం.?
సిమ్ బైండింగ్ అంటే మెసేజింగ్ యాప్ అకౌంట్ ఏ నెంబర్‌పై ఉంటుందో, ఆ నంబర్ ఖచ్చితంగా అదే మొబైల్‌లో ఉంటేనే వాట్సాప్ లాంటి యాప్‌లు పనిచేస్తాయి. వాట్సాప్, టెలిగ్రామ్‌తో పాటు స్నాప్‌చాట్, అరట్టై, షేర్‌చాట్, జోష్, జియోచాట్, సిగ్నల్ వంటి యాప్‌లు కూడా ఈ నిబంధనల పరిధిలోకి వస్తాయి.
eSIMలు, వైఫైతో నడిచే డివైస్‌ల పరిస్థితి ఏంటి..?
వైఫై ఆధారంగా మాత్రమే పనిచేసే ట్యాబ్లెట్లు లేదా రిజిస్టర్ చేసిన సిమ్ లేని పరికరాల్లో మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించేవారిపై ఈ నిబంధనలు ప్రభావం చూపవచ్చు. ప్రయాణాల సమయంలో సిమ్ మార్చే వారు, విదేశాల్లో స్థానిక సిమ్ ఉపయోగించే వారి అకౌంట్లపై ప్రభావం ఉండొచ్చు. అయితే, eSIMల విషయంలో ఈ నిబంధనలు ఎలా వర్క్ అవుతాయనే దానిపై స్పష్టమైన వివరాలు లేవు.
ఈ నియమాలు ఎందుకు కీలకం..?
ప్రస్తుతం సైబర్ నేరాల ముప్పు గణనీయంగా పెరిగింది. దీంతో సిమ్ బైండింగ్ లేకపోతే, సిమ్ తీసేసినా, ఇన్-యాక్టివ్ చేసినా కూడా మెసేజింగ్ యాప్‌లు పనిచేస్తూనే ఉన్నాయి. దీంతో ఫిషింగ్, వ్యక్తుల పేరుతో మోసాలు, పెట్టుబడి- రుణాల పేరుతో జరిగే మోసాలు, డిజిటల్ అరెస్టు మోసాలు వంటి నేరాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం, 2024లో సైబర్ మోసాల వల్ల కలిగిన నష్టాలు రూ. 22,800 కోట్లను దాటాయి. ప్రస్తుతం బ్యాంకింగ్, చెల్లింపుల యాప్‌లు సిమ్ బైండింగ్‌ను అమలు చేస్తు్న్నాయి. త్వరలో మెసేజింగ్ యాప్‌లకు కూడా ఇది వర్తింపచేస్తు్న్నారు.

