Site icon NTV Telugu

PSLV-C62: పీఎస్ఎల్వీ ప్రయోగం ఎందుకు విఫలమైంది.. అంతరిక్షంలో ఏం జరిగింది?

Pslv C62

Pslv C62

PSLV-C62: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2026 స్పేస్ క్యాలెండర్​లో తొలి ప్రయోగం విఫలమైంది. ఈరోజు (జనవరి 12) చేపట్టిన PSLV-C62 రాకెట్‌లో “EOS-N1” ఉపగ్రహంతో పాటు స్వదేశీ, విదేశాలకు చెందిన 15 ఇతర ఉపగ్రహాలను ప్రయోగించింది. అయితే, ప్రయోగించిన కొద్దిసేపటికే రాకెట్‌కు నిర్దేశించిన మార్గం నుంచి పక్కకు వెళ్లింది. మూడో దశలో ఆటంకం ఏర్పడినట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ప్రకటించారు. ప్రారంభంలో రాకెట్ అనుకున్న విధంగా ప్రయాణించినప్పటికీ, ‘‘చాంబర్ ప్రెజర్ ఊహించని విధంగా తగ్గడం మూడో దశ (PS3) అవసరమైన థ్రస్ట్‌ను అందించడంలో విఫలమైంది. రాకెట్ నిర్దేశిత మార్గం నుంచి పక్కకు వెళ్లింది. దీంతో శాటిలైట్లను కక్ష్యలో ఉంచలేకపోయాము’’ అని చెప్పారు.

Read Also: Supreme Court: రూ.2,742 కోట్ల స్కామ్‌పై దాడులు.. మమతపై సుప్రీంకోర్టులో ఈడీ ఆరోపణలు

ప్రధాన శాటిలైట్ అయిన డీఆర్డీవోకు చెందిన వ్యూహాత్మక నిఘా శాటిలైట్ అన్వేషాతో పాటు మరో 15 శాటిలైట్స్ అంతరిక్షంలో గల్లంతయ్యాయి. పీఎస్ఎల్వీ మూడో దశలో విఫలం కావడం ఇది వరసగా రెండోసారి. మొదటి రెండు దశలు బాగానే ఉన్నా, మూడో దశలో రాకెట్ గతి తప్పింది. రాకెట్ ఊహించని విధంగా నిర్దేశిత మార్గం నుంచి పక్కకు జరగడం ప్రారంభించింది. సమతుల్యత కోల్పోయి బొంగరంలా తన చుట్టూ తాను తిరగడం ప్రారంభించింది. అంతరిక్షంలో గంటకు 8000 కిలోమీటర్ల వేగంతో చిన్నపాటి కదుపు కూడా మిషన్ పూర్తిగా నాశనం అయ్యేలా చేస్తుంది. ప్రాథమిక డేటా ప్రకారం, చాంబర్ ప్రెజర్ తగ్గినట్లు తెలుస్తోంది. సరిగ్గా ఇలాగే మే 2025లో PSLV-C61 మిషన్‌ విఫలమైంది. తగినంత పీడనం లేకపోవడంతో, కక్ష్యలోకి చేరుకునే వేగాన్ని రాకెట్ అందుకోలేకపోయింది.

Exit mobile version