Parliament security breach: పార్లమెంట్లోకి దుండగులు చొరబడటం, స్మోక్ డబ్బాలను వాడటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు నిందితులు పలు నినాదాలు చేస్తూ పార్లమెంట్ ఛాంబర్ లోకి దూసుకెళ్లడం కలకలం సృష్టించింది. బుధవారం జరిగిన ఈ ఘటనలో ఒక్కసారిగా దేశం నివ్వెరపోయింది. డిసెంబర్ 13, 2001 పార్లమెంట్ ఉగ్రవాద దాడి రోజే, ఈ ఘటన జరగడంతో ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంది. పార్లమెంట్ లోపల ఇద్దరు నిందితులు పొగ డబ్బాలతో హల్చల్ చేయగా.. మరో ఇద్దరు పార్లమెంట్ వెలుపల హంగామా చేశారు. ఈ కుట్రలో మొత్తం ఆరుగురు నిందితులు ఉండగా.. ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు, మరొకరు పరారీలో ఉన్నాడు.
నిందితులు నాలుగేళ్ల నుంచి టచ్‌లో ఉన్నట్లు, ఈ ఘటనకు కొద్ది రోజుల ముందే పథకం వేసినట్లు విచారణలో వెల్లడైంది. సోషల్ మీడియా ద్వారా సమన్వయం చేసుకుని కుట్రకు పాల్పడినట్లు తేలింది. ఈ భద్రతా ఉల్లంఘనకు పాల్పడే ముందు పార్లమెంట్‌పై రెక్కీ నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Read Also: Krishna Janmabhoomi: మథుర శ్రీకృష్ణ జన్మభూమి సర్వేకు కోర్టు అనుమతి..
వివిధ అంశాలపై ప్రభుత్వం దృష్టిని ఆకర్షించే లక్ష్యంతో ఈ ఉల్లంఘన జరిగిందని నిందితులు విచారణ సందర్భంగా పోలీసులకు తెలిపారు. నిరుద్యోగం, రైతు సమస్యలు, మణిపూర్ హింసపై తాము కలత చెందామని నలుగురు నిందితులు పోలీసులకు చెప్పారు. ఈ విషయాలపై చట్టసభ సభ్యలు చర్చించడానికి వారి దృష్టిని ఆకర్షించేందుకు రంగు పొగను ఉపయోగించామని వారు చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలవాలని, సమస్యలతో ఆయనతో మాట్లాడాలని అనుకున్నట్లు తెలిపారు.
అయితే, నిందితులు చెప్పిన విషయాలను పోలీసులు నమ్మడం లేదు. వారి ఉద్దేశాన్ని నిర్ధారించేందుకు వారి ఫోన్లను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం వీరి ఫోన్లన్నీ నిందితుల్లో ఒకరైన లలిత్ ఝా వద్ద ఉన్నాయి. ప్రస్తుతం ఇతను పరారీలో ఉన్నారు. సాక్ష్యాధారాలను ధ్వంసం చేసేందుకు మొబైల్ ఫోన్లతో లలిత్ పరారైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
సాగర్ శర్మ, మనోరంజన్ అనే ఇద్దరు వ్యక్తులు విజిటర్లుగా పార్లమెంట్ లోకి వెళ్లి, గ్యాలరీ నుంచి ఛాంబర్‌లోకి దూసుకెళ్లి పొగ బాంబులను పేల్చారు. మరో ఇద్దరు అమోల్ షిండే, నీలం దేవి అనే వ్యక్తులు పార్లమెంట్ బయట నిరసన తెలిపారు. వీరంతా కూడా గురుగ్రామ్ లోని లలిత్ ఝా నివాసంలో ఉన్నారు. ఈ ఘటనలో భద్రతా ఉల్లంఘనపై లోక్‌సభ సెక్రటేరియట్ 8 మంది భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేసింది.