E20 JANTA PARTY: నీట్ పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పుట్టుకొచ్చింది. సోషల్ మీడియా నుంచి ప్రారంభమైన ఈ ఉద్యమం చివరకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వరకు సాగింది. ఇప్పుడు సీజేపీ లాగే కొత్తగా ఈజేపీ అంటే ‘‘’E20 జనతా పార్టీ’’ పుట్టుకొచ్చింది. ఈ పేరుతో కొత్తగా డిజిటల్ ప్రచారం మొదలైంది. E20 పెట్రోల్‌తో పాటు వినియోగదారులకు 100 శాతం స్వచ్ఛమైన పెట్రోల్ కొనుగోలు చేసే అవకాశం ఇవ్వాలనేది ఈ పార్టీ ప్రధాన డిమాండ్.
E20 జనతా పార్టీ పేరుతో ఇప్పటికే ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ప్రత్యేక అకౌంట్లు క్రియేట్ అయ్యాయి. ఇంధనం విషయంలో కూడా వినియోగదారులకు తాము ఎంచుకున్న పెట్రోల్ కొనుగోలు చేసే హక్కు కల్పించాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వం E20ను అందుబాటులో ఉంచినా, దానితో పాటు 100 శాతం పెట్రోల్‌ను కూడా విక్రయించాలని కోరుతున్నారు.
‘‘మా కార్లపై ప్రయోగాలు ఆపండి! ఇంధనాన్ని ఎంచుకునే హక్కు భారతదేశానికి కావాలి! మా వాహనాలు ప్రయోగ యంత్రాలు కావు. సంవత్సరాల ముందే పన్నులు చెల్లించి, మా కష్టార్జితంతో వాటిని కొన్నాము. మనది మధ్యతరగతి ప్రజలు అధికంగా ఉన్న దేశం, మరియు ఇంధన సామర్థ్యం + వాహన పనితీరు మా రోజువారీ జీవనంపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతాయి. అలాంటప్పుడు వాహన మాన్యువల్‌ను అనుసరించకుండా, మా ఇంజిన్లపై ఎందుకు ప్రయోగాలు చేస్తున్నారు?’’ అని ఈజేపీ అడుగుతోంది.
కొందరు వాహన యజమానులు 20 శాతం ఇథనాలు కలిపిన E20పెట్రోల్ వాడటం వల్ల వాహనాల ఇంజన్లు దెబ్బతింటున్నాయని, మైలేజ్ తగ్గిందని ఆరోపిస్తున్నారు. నిర్వహణ ఖర్చులు పెరిగినట్లు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం E20 జనతా పార్టీ పేరిట ఉన్న X ఖాతాకు 13 వేలకుపైగా, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు 8,800కుపైగా ఫాలోవర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

