Site icon NTV Telugu

Russia: భారత్‌ని మా నుంచి దూరం చేసేందుకు పాశ్చాత్య దేశాల కుట్ర..

India, Russia

India, Russia

Russia: భారత్‌ని తమ నుంచి దూరం చేయాలని పాశ్చాత్య దేశాలు ప్రయత్నిస్తున్నాయంటూ రష్యా ఆరోపించింది. భారత్‌లో రష్యా రాయబారి డెనిస్ అలిపోల్ మాట్లాడుతూ.. న్యూఢిల్లీ, మాస్కో మధ్య దీర్ఘకాల సంబంధాలకు అంతరాయం కలిగించేందుకు వెస్ట్రన్ దేశాలు ప్రయత్నిస్తున్నాంటూ మండిపడ్డారు. శనివారం ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చడానికి రష్యా తన మద్దతుని ప్రకటించింది.

వెస్ట్రన్ దేశాలు సెకండరీ ఆంక్షలు విధిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నాయని, కొంతమంది భారతీయ భాగస్వాములు కొన్ని సార్లు జాగ్రత్త వహిస్తున్నారని, కానీ చాలా మంది వాటిని లెక్క చేయడం లేదని రష్యా రాయబారి అన్నారు. రష్యా, భారత్ భాగస్వామ్యానికి రక్షణ సహకారంగా ఉందని, ఉక్రెయిన్ వివాదం ప్రారంభమైన తర్వాత రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకునే ప్రధాన దేశాల్లో భారత్ ఒకటిగా మారిందని డెనిస్ అలిపోవ్ చెప్పారు.

Read Also: Nitin Gadkari : త్వరలో దేశ రహదారులు అమెరికా వాటిలా మారుతాయన్న నితిన్ గడ్కరీ

భారత్, రష్యాకి నమ్మకమైన, కాల పరీక్షకు నిలిచిన స్నేహితుడని ఆయన పేర్కొన్నారు. భారత సామాజిక-ఆర్థిక అభివృద్ధిలో రష్యా సహకారం ఉందని, ఇది ఇప్పటికీ కొనసాగుతోందని, వెస్ట్రన్ దేశాల మాదిరిగా మేము ఎప్పుడు కూడా ఇక్కడి రాజకీయాల్లో షరతులు పెట్టలేదని, దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదని, పరస్పర గౌరవ, విశ్వసనీయ సంబంధాలను కొనసాగించామని అన్నారు.

భారత్ నాలుగు ప్రధాన వాణిజ్య భాగస్వామ్య దేశాల్లో రష్యా ఒకటని, భారత్ దిగుమతుల్లో మూడో వంతు కంటే ఎక్కువ హైడ్రోకార్బన్లు రష్యా నుంచే వస్తున్నాయని చెప్పారు. ఎరువులు, వజ్రాల రంగంలో ఇరు దేశాల మధ్య దైపాక్షిక వాణిజ్యం ఉందని చెప్పారు. సాంకేతిక బదిలీ, జాయింట్ వెంచర్ల ద్వారా Su-30MKI యుద్ధ విమానాలు, T-90 ట్యాంకులు మరియు AK-203 అసాల్ట్ రైఫిల్స్‌ వంటివి తయారు చేస్తున్నామని, బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ ఇరు దేశాల మధ్య గర్వించదగిన విషయమని రష్యా రాయబారి వెల్లడించారు.

Exit mobile version