NTV Telugu Site icon

West Bengal: దారుణం.. ఆస్పత్రిలో అప్పుడే పుట్టిన శిశువును ఎత్తుకెళ్లిన కుక్క

West Bengal

West Bengal

మమతా బెనర్జీ ప్రభుత్వంలో మరో ఘోరం వెలుగుచూసింది. ఓ ప్రభుత్వాస్పత్రిలో అప్పుడే పుట్టిన పసికందును ఓ కుక్క నోటితో కరుచుకుని ఎత్తుకెళ్లిపోయింది. ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్‌లోని బంకురా జిల్లాలో చోటుచేసుకుంది.

బంకురా జిల్లా బిష్ణుపిర్ సిబ్ డివిజన్‌లోని బంకురా సోనాముఖి రూరల్ ఆస్పత్రికి నవంబర్ 18న స్థానికంగా ఉండే గర్భిణీ వచ్చింది. రాత్రిపూట టాయిలెట్ కోసం బాత్రూమ్‌కి వెళ్లింది. అయితే ఉన్నట్టుండి ఆరు నెలలు నిండని శిశువు ఆస్పత్రి వాష్‌రూమ్‌లోనే ప్రసవం అయిపోయింది. అయితే ఆస్పత్రిలోనే తిరుగుతున్న ఓ కుక్క హఠాత్తుగా నోటితో కరుచుకుని వెళ్లిపోయింది. ఈ పరిణామంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. అయితే అప్రమత్తమైన సిబ్బంది.. తదుపరి చికిత్స కోసం బిష్ణుపూర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. అంతేకాకుండా ఈ ఘటనపై విచారణ జరుపుతామని ఆస్పత్రి అధికారులు వెల్లడించారు. సాయం చేయమని బతిమాలినా.. ఆస్పత్రి సిబ్బంది ఎవరూ రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

అయితే తాజా ఘటనపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది. మమత ప్రభుత్వంలో ఎవరికి భద్రత లేదు.. రక్షణ లేదంటూ ఆరోపించింది. అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు ప్రతిమా భూమిక్ ఎక్స్ ట్విట్టర్‌లో ప్రశ్నించారు. ఆస్పత్రిలో శిశువును ఎత్తుకెళ్తున్న ఫొటోను షేర్ చేశారు. ఇదొక షాకింగ్ ఘటన అంటూ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా రక్షణ లేకుండాపోతుందని నిలదీశారు.

కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో ఆగస్టు 9న జూనియర్ వైద్యురాలు అత్యంత ఘోరంగా హత్యాచారానికి గురైంది. ఈ ఘటన దేశాన్ని కుదిపేసింది. ఇక వైద్యులు రక్షణ కల్పించాలంటూ ఆందోళనలు కూడా చేపట్టారు. ఇక తాజా ఘటనతో మరోసారి భద్రతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.

 

Show comments