West Bengal: బెంగాల్ బోర్డర్‌లో టెన్షన్.. తిరిగి వెళ్లేందుకు బంగ్లాదేశీయుల పరుగులు..

West Bengal

West Bengal

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఉంటున్న బంగ్లాదేశ్ అక్రమ వలసదారుల్లో భయం మొదలైంది. వలసలపై సీఎం సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది. ‘‘డిటెక్ట్, డిలీట్ అండ్ డిపోర్ట్” విధానాన్ని బెంగాల్ ప్రభుత్వం అవలంభిస్తోంది. ఈ నేపథ్యంలో బెంగాల్‌లో ఇన్నాళ్లు అక్రమంగా ఉన్న బంగ్లాదేశీయులు, సొంత దేశానికి వెళ్లేందుకు సరిహద్దుల్లో క్యూ కడుతున్నారు. ముఖ్యంగా ఉత్తర పరగణాలు, మాల్దా జిల్లాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బషీర్‌హాట్ సబ్‌డివిజన్‌లోని హకీంపూర్ చెక్‌పోస్టు వద్ద వందలాది మంది బంగ్లాదేశీయులు గుమిగూడారు.

ఇలా వెళ్తున్నవారిలో చాలా మంది అక్రమంగా భారత్‌లో నివసిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం హోల్డింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి, అక్రమ వలసదారుల్ని నిర్బంధించాలని ఆదేశించిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే సీఎం సువేందు అధికారి అక్రమంగా ఉంటున్న వారికి వార్నింగ్ ఇచ్చారు. పౌరసత్వ సవరణ చట్టం (CAA) పరిధిలోకి రాని వారిని అక్రమ చొరబాటుదారులుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఇలాంటి వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని బీఎస్ఎఫ్‌కు అప్పగిస్తారని తెలిపారు.

ఈ నేపథ్యంలో మాల్దా జిల్లాలో హోల్డింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇంగ్లీష్ బజార్‌‌లోని చందన్ పార్క్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ డిటెన్షన్ సెంటర్‌లో 9 మంది అనుమానిత బంగ్లాదేశీయుల్ని ఉంచారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఆరుగురు మైనర్లు ఉన్నారు. ఈ సెంటర్ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసి 24 గంటలు సీసీటీవీ నిఘా, పోలీస్, సివిల్ డిఫెన్స్ బృందాలు సెక్యూరిటీని నిర్వహిస్తున్నాయి. వీరి పౌరసత్వాన్ని నిర్ధారించిన తర్వాత వారి దేశానికి పంపించే ప్రక్రియ ప్రారంభిస్తారు.