BJP MLA Rekha Patra: బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్రపై విషప్రయోగం.? పరిస్థితి విషమం..

  • బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్ర ఆరోగ్యం విషమం..
  • ఆమెపై విషప్రయోగం జరిగినట్లు అనుమానాలు..
  • ప్రస్తుతం కోల్‌కతాలో వెంటిలేటర్‌పై చికిత్స..
Bjp Mla Rekha Patra

Bjp Mla Rekha Patra

BJP MLA Rekha Patra: 2024లో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన సందేశ్ ఖాలీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రేఖా పాత్ర, ఈ ఏడాది ఎన్నికల్లో బీజేపీ తరుఫున ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెకు వెంటిలేషర్‌పై చికిత్స అందిస్తు్న్నారు. శనివారం ఆమె అస్వస్థతకు గురికావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి మెరుగుపడకపోవడంతో బసీర్‌హట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో కోల్‌కతాలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

రేఖా పాత్ర అనారోగ్యానికి కారణాలు ఏంటనేది స్పష్టంగా తెలియరాలేదు. ఈ ఘటనపై ఆస్పత్రి వర్గాలు, బీజేపీ నుంచి అధికార ప్రకటన రాలేదు. ఆదివారం ఉదయం రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శరద్వత్ ముఖర్జీ ఆసుపత్రికి చేరుకుని ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

విష ప్రయోగం జరిగిందా?

బెంగాలీ మీడియా చెబుతున్నదాని ప్రకారం.. రేఖా పాత్రకు ఇంటెన్సివ్ థెరపీ యూనిట్(ITU)లో డాక్టర్ యుధాజిత్ సేన్‌గుప్తా పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఆమెకు వెంటిలేటర్ సపోర్ట్ అందిస్తున్నారు. ఆమె శరీరంలో విషప్రయోగానికి సంబంధించిన సంకేతాలు ఉన్నట్లు నివేదికలు వెలువడ్డాయి. అయితే, అది ఏ పదార్థం, ఆమె శరీరంలోకి ఎలా చేరిందనే వివరాల గురించి తెలియరాలేదు. ప్రస్తుతం వైద్యులు ఆమె పరిస్థితిని మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు.

సందేశ్‌ఖాలీ ఉద్యమంతో రాజకీయ గుర్తింపు..

2024లో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన సందేశ్‌ఖాలీ ఉద్యమంలో రేఖా పాత్ర ప్రముఖంగా కనిపించారు. అప్పటి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేతలు మహిళలపై హింసకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తూ నిరసనల్లో పాల్గొన్నారు. ఈ ఉద్యమంతో ఆమె జాతీయం గుర్తింపు పొందారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆమెను బీజేపీ బసీర్‌హాట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపింది. ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హింగల్‌గంజ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.