NTV Telugu Site icon

Donald Trump: గాజా ప్రజల్ని జోర్డాన్, ఈజిప్ట్ తీసుకోవాలి.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

Gaza

Gaza

Donald Trump: హమాస్-ఇజ్రాయిల్ మధ్య ఇటీవల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. దాదాపుగా ఏడాదిన్నర పాటు సాగిన గాజా యుద్ధానికి తాత్కాలిక విరామం లభించినట్లైంది. సంధిలో భాగంగా హమాస్ చెరలో ఉన్న 90 మంది ఇజ్రాయిలీ బందీలను విడతల వారీగా విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో ఇజ్రాయిల్ తమ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్లను విడుదల చేస్తోంది.

ఇదిలా ఉంటే, తాజాగా పదవీ బాధ్యతలు చేపట్టిన అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గాజా ప్రజలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనియన్లను ఈజిప్టు, జోర్డా్న్ తీసుకోవాలనే ఆలోచనను శనివారం ముందుకు తెచ్చారు. అయితే, ఈ ప్రతిపాదనను ఇజ్రాయిల్ ఆర్థిక మంత్రి జెజలెన్ స్మోట్రిక్ స్వాగతించారు. మరోవైపు హమాస్, ఇస్లామిక్ జిహాద్ సహా పాలస్తీనయన్ గ్రూపులు తీవ్రంగా వ్యతిరేకించాయి.

Read Also: Guillain-Barre Syndrome: గులియన్ బారే సిండ్రోమ్(GBS)తో పూణేలో తొలి మరణం..

పాలస్తీనియన్లను గాజా నుంచి తరలించడంపై తాను జోర్డాన్ రాజు అబ్దుల్లా 2తో మాట్లాడానని శనివారం ట్రంప్ అన్నారు. ఈజిప్ట్ కూడా గాజా ప్రజల్ని తీసుకోవాలని కోరుకుంటున్నానని, ట్రంప్ కోరారు. ‘‘గాజాలో దాదాపుగా అన్నీ కూల్చివేయబడ్డాయి. అక్కడ ప్రజలు చినపోతున్నారు. కాబట్టి నేను కొన్ని అరబ్ దేశాలతో కలిసి, వారు శాంతియుతంగా జీవించేందుకు పలు ప్రదేశాల్లో గృహాలు నిర్మించాలని అనుకుంటున్నాను’’ అని ట్రంప్ అన్నారు. ఆదివారం ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా అల్ సిసితో మాట్లాడనున్నట్లు తెలిపారు.

ట్రంప్ వ్యాఖ్యల్ని ఇజ్రాయిల్ స్వాగితించింది. మెరుగైన జీవితాన్ని ప్రారంభించడానికి వారికి ఇతర ప్రదేశాలు కనుగొనడం గొప్ప ఆలోచన అని చెప్పింది. ట్రంప్ ఆలోచన దుర్మార్గమైనదని హమాస్, ఇతర పాలస్తీనా గ్రూపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గాజా వాసుల్ని జోర్డార్, ఈజిప్ట్ తరలించే ట్రంప్ ఆలోచనల్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు హమాస్ చెప్పింది. అక్టోబర్ 7, 2023న ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి చేసి 1200 మందిని హతమార్చి, 200 మందికి పైగా ప్రజల్ని బందీలుగా పట్టుకుంది. అప్పటి నుంచి ఇజ్రాయిల్, గాజాపై భీకరదాడి చేసింది. ఈ దాడుల్లో 47000 మందికి పైగా మరణించారు.