NTV Telugu Site icon

Akhilesh Yadav: రష్యాలో అలెక్సీ నవల్నీని విష ప్రయోగంతో చంపలేదా..? గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీకి అఖిలేష్ మద్దతు..

Akhilesh Yadav

Akhilesh Yadav

Akhilesh Yadav: ఇటీవల జైలులో మరణించిన గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడు ముఖ్తాన్ అన్సారీ కుటుంబాన్ని ఆదివారం అఖిలేష్ యాదవ్ పరామర్శించారు. ఉత్తర్ ప్రదేశ్ ఘాజీపూర్‌లోని అన్సారీ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యుల్ని కలుసుకున్నారు. బండా జైలులో గుండెపోటుతో మరణించిన అన్సారీ మృతిపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అన్సారీ మరణానికి దారి తీసిన పరిస్థితులు దిగ్భ్రాంతిని కలిగించేవిగా ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్ పర్యవేక్షణలో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు అన్సారీ మరణానికి మద్దతుగా ముస్లింలు ఈద్ జరుపుకోవద్దని సమాజ్ వాదీ పార్టీ సూచించింది.

ప్రభుత్వం నిజాన్ని వెల్లడిస్తుందని తాను నమ్మడం లేదని, పారదర్శక విచారణ ద్వారా మాత్రమే న్యాయం జరుగుతుందని అఖిలేష్ యాదవ్ అన్నారు. జైలు వ్యవస్థలో నిర్లక్ష్యం, దుర్వినియోగం జరిగిందని ఆయన ఆరోపించారు. ఖైదీలను రక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని యోగీ సర్కార్‌పై మండిపడ్డారు. సాధారణ ప్రలు దీనిని సహజ మరణంగా చూడటం లేదని, అమెరికా, కెనడాల్లో జరిగిన పలు ఘటనల్లో భారత ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయని, ముఖ్తాన్ అన్సారీ ప్రజాసేవకుడు, ప్రజాస్వామ్యంలో ప్రజల కష్టాలను పాలుపంచుకునే వాడని ఆయన పేర్కొన్నాడు.

Read Also: Annamalai: క్రికెట్ స్టేడియం హామీ ఎన్నికల స్టంట్.. సీఎం స్టాలిన్‌పై అన్నామలై..

రష్యాలో ప్రతిపక్ష నేత అలెక్సీ నవల్నీని విషప్రయోగంతో మరణించలేదా..? అని ప్రశ్నించారు. ముఖ్తార్ అన్సారీకి జైలులో విష ప్రయోగం జరిగిందని ఆరోపించారు. ఇలాంటి సంఘటన కొత్తది కాదని, జైలులో ఖైదీలకు ప్రాణహాని ఉందని, ప్రభుత్వం భద్రత కల్పించడం లేదని ఆరోపించారు. ఈ విషయంలో మీడియాపై ఒత్తిడి ఉందని అన్నారు. మరోవైపు ఎస్పీవి ఓటు బ్యాంకు రాజకీయాలు అని బీజేపీ ఆరోపించింది. రాజకీయ లబ్ధి కోసం అఖిలేష్ ఇలా చేస్తున్నారని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఆరోపించారు.

ఉత్తర్ ప్రదేశ్‌లో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖ్తార్ అన్సారీ మార్చి 28న బండా జైలులో గుండెపోటుతో మరణించారు. అయితే, తన తండ్రిపై విష ప్రయోగం జరిగిందని అన్సారీ కుమారుడితో పాటు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అన్సారీ పోస్టుమార్టం నివేదికలో అతను గుండెపోటుతో మరణించాడని డాక్టర్లు స్పష్టం చేశారు. అఖిలేష్ యాదవ్‌తో పాటు అసదుద్దీన్ ఓవైసీ వంటి నేతలు అన్సారీ కుటుంబాన్ని పరామర్శించారు.