NTV Telugu Site icon

Ajmer Dargah: అజ్మీర్ దర్గా నిజంగా శివాలయమా..? ఆధారాలు ఏం చెబుతున్నాయి..?

Ajmer Dargah

Ajmer Dargah

Ajmer Dargah: ప్రఖ్యాత అజ్మీర్ దర్గా ప్రస్తుతం వివాదస్పదంగా మారింది. ఈ దర్గా ఒకప్పుడు శివాలయమని రాజస్థాన్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. దర్గాని ‘‘సంకట్ మోచన్ మహాదేవ్ టెంపుల్’’గా ప్రకటించాలని, ఈ స్థలంలో హిందువుల పూజలకు అనుమతి ఇవ్వాలని హిందూ సేన చీఫ్ విష్ణు గుప్తా కోరారు. దీనికి పలు ఆధారాలను ఆయన కోర్టు ముందు ఉంచారు. హర్ బిలాస్ సర్దా (1867–1955) రాసిన పుస్తకాన్ని ప్రస్తావించారు. 1910 ప్రచురణలో సర్దా “దర్గా కింద హిందూ దేవాలయం ఉన్నట్లు రాశాడు” అని గుప్తా ఆరోపించారు.

విష్ణుగుప్తా సాక్ష్యంగా చెబుతున్న ఈ పుస్తకం ‘‘అజ్మీర్: ది హిస్టారిక్ అండ్ డిస్క్రప్టివ్’’. దీనిని 1911లో స్కాటిష్ మిషన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రచురించింది. ఇందులో అజ్మీర్ దర్గా వద్ద ‘‘శివుడి’’తో అనుసంధానించబడే భూగర్బ సెల్లార్, సంప్రదాయం గురించి రాశాడు. ఖ్వాజా అవశేషాలు ఈ సమాధికి దిగువన కొన్ని ఇటుకలతో కప్పబడిన భూగర్భ సెల్లార్‌లో ఉన్నాయని, ఈ సమాధి పాలరాతితో , రంగు రాళ్లతో కప్పబడి ఉందని రాశాడు. సంప్రదాయం ప్రకారం.. సెల్లార్ లోపల ఆలయంలో మహాదేవుడి చిత్రం ఉందని రాయబడింది.

Read Also: Value Zone-Hyper Mart: భారతదేశంలోనే అతి పెద్ద వాల్యూ జోన్-హైపర్ మార్ట్.. ఇప్పుడు నాచారంలో

మహదేవ మందిరం, శివలింగం అక్కడి చెత్తలో దాగి ఉందని బ్రిటీష్ చరిత్రకారుడు ఆర్‌హెచ్ ఇర్విన్ రాసిన ‘‘సమ్ అకౌంట్ ఆఫ్ ది జనరల్ అండి మెడికల్ టోపోగ్రఫీ ఆఫ్ అజ్మీర్(1841)’’ చెప్పింది. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ సమయంలో అక్కడ ఉనికితో మహాదేశ పురాతన పవిత్ర పుణ్యక్షేత్రం ఉన్నట్లు పేర్కొన్నాడు. ఇక సర్దా రాసిన బుక్‌లో బులంద్ దర్వాజాలో హిందూ అంశాలను ప్రస్తావించారు. 75 అడుగుల గేట్ వేకి ఉత్తరం వైపున హిందూ సంబంధిత ఆనవాళ్లను గుర్తించినట్లు పేర్కొన్నారు.

1192 సెకండ్ బాటిల్ ఆఫ్ టెర్రైన్ జరిగిన సమయంలో ఉత్తర భారతదేశంలో అజ్మీర్ పెద్ద భాగంగా ఉండేది. అది మహ్మద్ ఘోరీ ఆధీనంలోకి వెళ్లిపోయింది. 1206లో ఘోరీ మరణాంతరం బానిస వంశస్తులు కుతుబుద్దీన్ ఐబక్ పాలన ప్రారంభమైంది. అజ్మీర్ దర్గా నిర్మాణం సుల్తాన్ ఇల్‌టుల్‌మిష్ (1211-1236) కాలంలో ప్రారంభమైంది. మొఘలు చక్రవర్తులు హుమాయూన్, షాజహాన్ పాలనలో అనేక మార్పులు జరిగాయి. అజ్మీర్ దర్గాలో సర్వే కోసం గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌పై తదుపరి విచారణ డిసెంబర్ 20న జరగనుంది.