NTV Telugu Site icon

Waqf Bill: విపక్షాల ఆందోళనతో “పార్లమెంట్ కమిటీ”కి వక్ఫ్ బిల్లు..

Waqf Bill

Waqf Bill

Waqf Bill: వక్ఫ్ బోర్డు ‘అపరిమిత అధికారాలకు’ కత్తెర వేసేందుకు, మిగిలిన కమ్యూనిటీలకు ప్రాధాన్యత దక్కేలా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును ఈ రోజు లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అయితే, ఈ బిల్లు రాజ్యంగవ్యతిరేకమని, రాజ్యాంగంపై దాడిగా కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలు ఆరోపించాయి. కాంగ్రెస్‌తో పాటు సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే, ఎన్సీపీ, ఎంఐఎం పార్టీలు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. అయితే, ప్రతిపక్షాలకు కేంద్రం ధీటుగా సమాధానం ఇచ్చింది. ఈ బిల్లు కాంగ్రెస్ హయాంలోని సచార్ కమిటీ సిఫారసుల ఆధారంగా రూపొందించామని, వక్ఫ్ బోర్డు మాఫియా వశమైందని కేంద్రమంత్రి అన్నారు.

Read Also: Samantha : నాగచైతన్య ఎంగేజ్మెంట్.. ఒంటరి వాళ్ళు కాదని గుర్తుంచుకోవాలంటూ సమంత సంచలన పోస్ట్

ముఖ్యంగా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బిల్లును తీవ్రంగా వ్యతిరేకించడంతో వక్ఫ్ సవరణ బిల్లు జాయింట్ పార్లమెంట్ కమిటీ(జేపీసీ)కి పంపబడింది. 1995 చట్టంలో సవరణలు చేస్తూ, ముస్లిం మహిళలను వక్ఫ్ బోర్డుల్లో చేర్చడం, ఒక ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే ముందు భూమిని ధృవీకరించడం వంటి ముఖ్యమైన మార్పులను కొత్తగా తీసుకురాబోతున్న బిల్లు ప్రతిపాదిస్తుంది. వక్ఫ్ బోర్డు ద్వారా వచ్చే డబ్బును ప్రభుత్వం సూచించిన పద్ధతిలో వితంతువులు, విడాకులు తీసుకున్నవారు మరియు అనాథల సంక్షేమానికి ఉపయోగించాలని కూడా నిర్దేశించింది. మహిళల వారసత్వ సంపదకు రక్షణ కల్పించాలన్నది మరో కీలక ప్రతిపాదన. వక్ఫ్ సంస్థల్లో ముస్లిమేతర సభ్యులను చేర్చాలనే నిబంధన ప్రతిపాదిత చట్టంలోని మరో వివాదాస్పద అంశం.

లోక్‌సభలో బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ఇది కఠినమైన చట్టమని, మతస్వేచ్ఛ, సమాఖ్య వ్యవస్థపై దాడి అని అన్నారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమించడాన్ని ఆయన వ్యతిరేకించారు. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ కూడా ఈ బిల్లుని వ్యతిరేకించింది. ఈ బిల్లును బాగా ఆలోచించి రాజకీయాల్లో భాగంగా ప్రవేశపెట్టారని విమర్శించింది. ప్రజాస్వామ్య ప్రక్రియ ఉన్నప్పుడు వ్యక్తుల్ని ఎందుకు నామినేట్ చేయాలని ప్రశ్నించింది. ముస్లిం కాని వారిని వక్ఫ్ బోర్డులో నామినేట్ చేయడం ఏమిటి..? అని ప్రశ్నించింది. ఇది మైనారిటీ వర్గానికి వ్యతిరేకమని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు.