20 ఏళ్లుగా కర్ణాటకకు కంటిలో నలుసుగా ఉన్న మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ కిల్లర్ విక్రమ్ గౌడ్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. ఉడిపిలో జరిగిన ఎదురుకాల్పుల్లో విక్రమ్ గౌడ్ మృతిచెందాడు. నక్సల్ నాయకుడు విక్రమ్ గౌడ హతమైనట్లు రాష్ట్ర హోంమంత్రి జి పరమేశ్వర ధృవీకరించారు. విక్రమ్ గౌడ్ మావో కార్యకలాపాల్లో చురుగ్గా ఉంటాడని.. రాష్ట్రాల మధ్య నిత్యం తిరుగుతున్నాడని తెలిపారు. 2018 నుంచి కర్ణాటకలో నక్సల్స్ కార్యకలాపాలు చాలా తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు.
రెండు దశాబ్దాలుగా విక్రమ్ గౌడ్ పోలీసులకు తప్పించుకుని తిరుగుతున్నాడు. సోమవారం ఉడిపిలోని కబ్బినాలే అడవుల్లో యాంటీ నక్సల్ ఫోర్స్ ఆపరేషన్ నిర్వహించింది. వారికి ఎదురుపడ్డ విక్రమ్‌ను యాంటీ నక్సల్ ఫోర్స్ హతమార్చింది. ఉడిపి జిల్లాలో మావోయిస్టుల ఎన్‌కౌంటర్ జరగడం ఇదే మొదటిసారి.
ఐదుగురు మావోయిస్టులు కిరాణా సామాగ్రి తీసుకునేందుకు వచ్చినట్లు ఉడిపి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఉడిపి పోలీసు సిబ్బంది హెబ్రీ తాలూకా సమీపంలోని ఒక ప్రదేశానికి వెళ్లారు. విక్రమ్ గౌడ్ నక్సల్స్ ఉద్యమంలో కీలక వ్యక్తి అని, దశాబ్దాలుగా పట్టుబడకుండా తప్పించుకున్నాడని హోంమంత్రి పరమేశ్వర తెలిపారు. “నక్సల్ గ్రూప్ చురుకుగా ఉండేది, మరియు విక్రమ్ చాలా కాలంగా వాంటెడ్ నక్సల్ నాయకుడు. ఆపరేషన్ సమయంలో అతను పోలీసు అధికారులపై కాల్పులు జరిపాడు, ప్రతీకార చర్యను ప్రేరేపించాడు, దాని ఫలితంగా అతని మరణానికి దారితీసింది,”అని పరమేశ్వర చెప్పారు.
కబ్బినాలే అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగిందని పేర్కొన్నారు. విక్రమ్ గౌడ్ ఎదురుపడగా.. అతనితో పాటు మరో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు అడవిలోకి తప్పించుకున్నారని హోంమంత్రి వెల్లడించారు. మిగిలిన అనుమానితుల జాడ కోసం ఏఎన్‌ఎఫ్ బృందం కూంబింగ్ కార్యకలాపాలను ముమ్మరం చేసిందని మంత్రి తెలిపారు.