West Bengal: రామ నవమి నుంచి పశ్చిమ బెంగాల్ అట్టుడుకుతోంది. రామ నవమి రోజున ప్రారంభం అయిన మతఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. గత రెండు రోజుల నుంచి హౌరాలోని శిబ్ పూర్, కాజీపరా ప్రాంతాల్లో హింస చెలరేగుతోంది. రామ నవమి రోజున శోభాయాత్రపై ఓ వర్గం వారు రాళ్లదాడికి పాల్పడటంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇరు వర్గాల మధ్య తీవ్రమైన పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఆదివారం హుగ్లీలోని రిస్రా ప్రాంతంలో బీజేపీ ఆధ్వర్యంలో రామ నవమి శోభాయాత్రపై మరోసారి రాళ్లదాడి జరిగింది. శోభాయాత్రఅలో బీజేపీ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఉన్న సమయంలోనే దుండగులు వీరంగం సృష్టించారు. బీజేపీతో కలిసి విశ్వహిందూ పరిషత్, ఇతర హిందూ సంస్థలు ఈ ర్యాలీని నిర్వహించాయి. తాజాగా జరిగిన దాడిలో ఎమ్మెల్యే బిమన్ ఘోష్ గాయపడినట్లు బీజేపీ పేర్కొంది. సమాచారం అందుకున్న వెంటనే చందన్ నగర్ పోలీస్ కమిషనర్ అమిత్ జబల్ గీర్ అదనపు పోలీస్ బలగాలతో సంఘటన స్థలానికి చేరుకున్నారు.
Read Also: S Jaishankar: “బ్యాడ్ హ్యాబిట్”.. రాహుల్ విషయంలో వెస్ట్రన్ దేశాలకు క్లాస్..
ఇదిలా ఉంటే ఈ ఘర్షణలు అధికార త్రుణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీల మధ్య మాటల యుద్ధాన్ని పెంచుతున్నాయి. సీఎం మమతా బెనర్జీ హిందూ వ్యతిరేకి అని బీజేపీ నేతలు ఆరోపిస్తుంటే, కావాలనే బీజేపీ అల్లర్లను ప్రేరేపిస్తోందని టీఎంసీ ఆరోపిస్తోంది. హుగ్లీలో జరిగిన విధంగానే హౌరాలో జరిగిందని, ముందస్తు ప్రణాళిక ప్రకారమే బీజేపీ అల్లర్లను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ అన్నారు.
హౌరాలో హింస చెలరేగిన కొద్ది రోజులకే హుగ్లీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షనలకు సంబంధించి మొత్తం 38 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే పుర్బా బర్ధమాన్‌లోని శక్తిగ్రాహ్‌లో శనివారం సాయంత్రం బీజేపీ నాయకుడు రాజు ఝా అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి సంఘటనలు జరుగుతుండటం పశ్చిమ బెంగాల్ లో ఉద్రిక్త పరిస్థితులు రేకెత్తిస్తున్నాయి.