CM Vijaya: తమిళనాడులో రైతులు, ఉపాధ్యాయులకు భారీ ఊరట కల్పించేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి విజయ్.. తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఆందోళనలు చేసిన రైతులు, ఉపాధ్యాయులపై గతంలో నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని విజయ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో 92 వేల మందికి పైగా రైతులు, ఉపాధ్యాయులకు ప్రయోజనం కలగనుంది.
2021 మే నుంచి 2026 ఏప్రిల్ వరకు నమోదైన కేసులను ప్రభుత్వం పరిశీలించింది. ఈ క్రమంలో మొత్తం 600 కేసులను గుర్తించి వాటిని ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. శాంతియుత నిరసనల్లో పాల్గొన్న వారిపై నమోదైన కేసులను ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఏళ్లుగా కేసులను ఎదుర్కొంటున్న వారికి ఊరట లభించనుంది. సెప్టెంబర్ 2వ తేదీన తమిళనాడు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి విజయ్ ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. చట్టపరమైన నిబంధనల ప్రకారం కేసులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఉపసంహరణ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో వేలాది మంది రైతులు, ఉపాధ్యాయులు ఊపిరి పీల్చుకోనున్నారు.

