హనీమూన్ మర్డర్ కేసులో బాధిత కుటుంబం కీలక నిర్ణయం తీసుకుంది. నిందితురాలు సోనమ్ రఘువంశీ.. భర్తను ఎందుకు చంపాల్సి వచ్చిందో తెలుసుకోవాలని బాధిత కుటుంబం నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో నిందితురాలు సోనమ్‌కు నార్కో పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు రాజా రఘువంశీ కుటుంబ సభ్యులు తెలిపారు. అంతేకాకుండా నిందితురాలికి సహకరించిన వ్యక్తికి బెయిల్ మంజూరు చేయడాన్ని కూడా సవాల్ చేస్తామని పేర్కొన్నారు. ఇందుకోసం షిల్లాంగ్‌లో న్యాయవాదిని నియమిస్తామని రాజా రఘువంశీ కుటుంబం తెలిపింది.
ఇది కూడా చదవండి: Kerala: కేరళలో షాకింగ్ ఘటన.. హత్యాచార ఖైదీ జైలు గోడ దూకి పరారీ
రాజా రఘువంశీ హత్యకు గురైన ప్రాంతాన్ని బాధిత కుటుంబం సందర్శించింది. ఆ ప్రదేశంలోనే మతపరమైన ఆచారాలు నిర్వహించాలని కుటుంబం నిర్ణయం తీసుకుందని విపిన్ రఘువంశీ మీడియాకు తెలిపారు. వివాహం తర్వాత సోనమ్ తన భర్తను ఎందుకు చంపాల్సి వచ్చిందో.. అసలు కారణాన్ని తెలుసుకోవడానికి ఆమెకు నార్కో పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ రాజా రఘువంశీ కుటుంబం పిటిషన్ దాఖలు చేస్తుందని చెప్పారు.
ఇక సోనమ్ అన్నయ్య గోవింద్ ఆమె కోసం బెయిల్ దరఖాస్తు దాఖలు చేయడానికి షిల్లాంగ్, పొరుగున ఉన్న అస్సాంలోని గౌహతిలో న్యాయవాదిని నియమించుకోవాలని చూస్తున్నారని వర్గాలు తెలిపాయి. అయితే సోనమ్ కుటుంబం మాత్రం ఈ విషయాన్ని ధృవీకరించలేదు.
ఇది కూడా చదవండి: PM Modi: మాల్దీవులు చేరుకున్న మోడీ.. స్వయంగా స్వాగతం పలికిన ముయిజ్జు
సోనమ్‌కు మే 11న ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీతో వివాహం అయింది. అయితే మే 20న హనీమూన్ పేరుతో మేఘాలయకు తీసుకెళ్లి కిరాయి హంతకులుతో చంపేసి లోయలో పడేసింది. అనంతరం ప్రియుడితో కలిసి పారిపోయింది. జూన్ 2న లోయలో రాజా మృతదేహం లభించింది. ఇక జూన్ 7న పోలీసుల ఎదుట సోనమ్ లొంగిపోయింది. ఈ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
