ఇటీవల బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు గత వారం దేశవ్యాప్తంగా ముస్లింలు ఆందోళనలు చేస్తున్నారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే సమయంలో కొన్ని చోట్ల హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ముఖ్యంగా యూపీలోని ప్రయాగ్ రాజ్, కాన్పూర్, సహరాన్ పూర్ ప్రాంతాల్లో రాళ్ల దాడులు జరిగాయి. జార్ఖండ్ రాంచీలో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. పోలీసులకు, ఆందోళనకారుల ఘర్షణల్లో ఇద్దరు మరణించారు. పశ్చిమ బెంగాల్ హౌరాలో కూడా పెద్ద ఎత్తున హింస చెలరేగింది.
ఇదిలా ఉంటే జూన్ 10న దేశవ్యాప్తగా జరిగిన హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ మంగళవారం నిరసనలకు పిలుపినిచ్చింది. ఢిల్లీలో మంగళవారం అన్ని దేవాలయాల్లో ప్రజలు ‘ హనుమాన్ చాలీసా’ పారాయణం చేయాలని పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా భారత్ పరువు తీయడానికి ప్రణాళికబద్ధంగా కుట్ర జరుగుతోందని విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది. ఇందులో భాగంగానే శుక్రవారం మసీదుల్లో ప్రార్థనల అనంతరం దేవాలయాలు, ఇళ్లపై హింసాత్మక దాడులు జరిగాయని, రాళ్లు రువ్వారని వీహెచ్పీ పేర్కొంది.
జూన్ 10న ఢిల్లీలో నుపుర్ శర్మ, నవీన్ జిందాల్ వ్యాఖ్యలకు వ్యతిరేఖంగా జామా మసీదులో ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయితే మేము ఎలాంటి ఆందోళనకు పిలుపుఇవ్వలేదని.. ఇది ఎంఐఎం వ్యక్తుల పనిగా మసీదు ఇమాన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఎలాంటి అనుమతులు లేకుండా ఆందోళనలు చేయడంతో ఢిల్లీ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ ఘటనల వెనక కొంతమంది హస్తం ఉందని పోలీసులు ఆరోపిస్తున్నారు.
నుపుర్ శర్మను చంపుతామని బెదిరించడం, ఆమె హత్యకు చట్టవిరుద్ధమైన ఫత్వాలు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఢిల్లీ వీహెచ్పీ చీఫ్ కపిల్ ఖన్నా. దీనికి నిరసనగా ఢిల్లీలోని హిందూ సమాజం చిన్న, పెద్ద ఆలయాల వద్ద గురువారం రాత్రి 8 గంటలకు హనుమాన్ చాలీస్ పారాయణంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. హనుమాన్ చాలీసా గురించి భక్తులకు తెలిసేలా దేవాలయాల్లో నోటీసులు పెట్టాలని ఆలయ నిర్వాహకులకు సూచించారు.
