NTV Telugu Site icon

India at UN: ఆ దేశాల స్వార్థప్రయోజనాలకే “వీటో”.. యూఎన్‌లో గళమెత్తిన భారత్..

Un

Un

India at UN: ఐక్యరాజ్య సమితిని సంస్కరించాలని భారత్ ఎప్పటి నుంచో కోరుతోంది. ముఖ్యంగా ఐదు దేశాలకు మాత్రమే శాశ్వత సభ్యత్వ హోదా, వీటో అధికారం ఉండటంపై గళమెత్తుతోంది. కేవలం ఈ ఐదు దేశాలు మాత్రమే ప్రపంచం మొత్తానికి ప్రాతినిధ్యం వహించలేవని చెబుతోంది. భారత్ వాదనకు ఇతర ప్రపంచదేశాలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. భద్రతా మండలిని సంస్కరించాలని పలుమార్లు భారత్ యూఎన్ ను కోరింది.

అయితే ఆ దిశంగా కొన్ని దేశాలు ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తున్నాయి. ప్రస్తుతం ఐరాస భద్రతా మండలిలో అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనాలకు శాశ్వత సభ్యత్వం, వీటో అధికారం ఉంది. 140 కోట్ల జనాభా ఉండీ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత్ కు సభ్యత్వం లేకపోవడం పట్ల భారత్ పలుమార్లు తమ నిరసన తెలియజేసింది. నాలుగు దేశాలు అంగీకరించినప్పటికీ, జిత్తులమారి చైనా భారత్ శాశ్వత సభ్యత్వ హోదాకు ఒప్పుకోవడం లేదు.

Read Also: Thailand: థాయ్‌లాండ్‌లో దారుణం.. 12 మంది స్నేహితులకు సైనైడ్ ఇచ్చి హత్య చేసిన మహిళ

ఇదిలా ఉంటే మరోసారి భారత్ వీటో అధికారంపై యూఎన్ లో ప్రస్తావించింది. వీటో అధికారాన్ని కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఉపయోగించుకుంటున్నాయని, నైతిక బాధ్యతతో కాదని భారత్ యూఎన్ సాధారణ సభలో వ్యాఖ్యానించింది. భారత కౌన్సిలర్ ప్రతీక్ మథూర్ ‘వీటో ఇనిషియేటివ్’ తీర్మానానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘యూజ్ ఆఫ్ వీటో’పై యూఎన్ సాధారణ సభలో ప్రసంగించారు. గత 75 ఏళ్లుగా కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం శాశ్వత సభ్యదేశాలు వీటోను వాడుకుంటున్నాయని, ఇదే తీరు కొనసాగినంత కాలం సభ్యదేశాలు వీటోను ఇలాగే వినియోగించుకుంటాయని, నైతిక బాధ్యతను పక్కన పెట్టి వ్యవహరిస్తాయని ప్రతీక్ మథూర్ అన్నారు.

గతేడాది ఉక్రెయిన్ యుద్ధం సమయంలో రష్యా తన వీటో అధికారాన్ని ఉపయోగించుకుంది. ఈ నేపథ్యంలో గత ఏప్రిల్ లో ‘వీటో ఇనిషియేటివ్’పై సాధారణ సభ్యదేశాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా కీలక నిర్ణయం తీసుకోవడం ఆందోళనకరం అని భారత్ తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఐరాస భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్యదేశాలతో పాటు 10 తాత్కాలిక సభ్యదేశాలు ప్రతీ రెండేళ్ల పరిమితితో ఉంటాయి. ఈ 10 దేశాలకు వీటో అధికారం లేదు. భద్రతా మండలిలో ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాలకు ప్రాతినిథ్యం లేదని భారత్ పలుమార్లు ప్రస్తావించింది.