NTV Telugu Site icon

Raebareli: రాయ్‌బరేలీ పోరులో వరుణ్ గాంధీ.. బీజేపీ ప్రతిపాదన తిరస్కరణ..

Priyanja Gandhi, Varun Gandhi

Priyanja Gandhi, Varun Gandhi

Raebareli: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ ఎంపీ స్థానం నుంచి వరుణ్ గాంధీని రంగంలోకి దించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ ప్రియాంకాగాంధీని పోటీలో నిలబెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే, ఆమెకు పోటీగా అదే కుటుంబానికి చెందిన వరుణ్ గాంధీని రంగంలోకి దించాలని బీజేపీ భావిస్తోంది. అయితే, ఈ ప్రతిపాదనను వరుణ్ గాంధీ తిరస్కరించినట్లు సమాచారం.

ఈ స్థానం నుంచి ప్రియాంకా గాంధీని పోటీ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు బుధవారం తెలిపాయి. ఈ స్థానం నుంచి సోనియాగాంధీ ఎంపీగా ఉన్నారు. అయితే, ఆమె ఇటీవల రాజస్థాన్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికై, ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ స్థానం నుంచి ప్రియాంకాను బరిలోకి దించాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ వరుణ్ గాంధీని పోటీలో దింపాలని అనుకున్నప్పటికీ, ఆయన దీనికి అంగీకరించనట్లు తెలుస్తోంది. ‘‘గాంధీ వర్సెస్ గాంధీ’’ పోరుకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారని తెలుస్తోంది.

Read Also: Sahya: యూట్యూబర్ మౌనిక రెడ్డి హీరోయిన్గా “సహ్య”.. ఆసక్తికరంగా ఫస్ట్ లుక్!

వరుణ్ గాంధీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న పిలిభిత్ స్థానానికి బీజేపీ ఆయనను కాదని మాజీ మంత్రి జితిన్ ప్రసాదను ఆ స్థానంలో నిలబెట్టింది. అయితే, అప్పటి నుంచి ఆయన బీజేపీపై అసంతృప్తితో ఉన్నారని సమాచారం. మరోవైపు వరుణ్ గాంధీ తల్లి, మేనకాగాంధీకి సుల్తాన్‌పూర్ ఎంపీ టికెట్‌ని బీజేపీ కేటాయించింది. అయితే, రాయ్‌బరేలీలో గాంధీ ఫ్యామిలీకి ఎవరు గట్టి సవాల్ విసురుతారనే దానిపై బీజేపీ అనేక సర్వేలు నిర్వహించినట్లు సమాచారం.

2004 నుంచి సోనియాగాంధీ ఈ స్థానం నుంచి వరసగా గెలుస్తున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రాయ్‌బరేలీ సీటు నుంచి 1967 నుంచి 1984 వరకు పార్లమెంట్‌కి పంపబడ్డారు. అరుణ్ నెహ్రూ, షీలా కౌల్‌తో సహా నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన ఇతర సభ్యులు కూడా రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానాన్ని గెలుచుకున్నారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీని అమేథీ నుంచి స్మృతి ఇరానీ ఓడించినప్పటికీ, రాయ్‌బరేలీని మాత్రం బీజేపీ కైవసం చేసుకోలేకపోయింది. అయితే, 2014 నుంచి సోనియాగాంధీ ఓట్ల శాతం మాత్రం తగ్గుతూ వస్తోంది. 2009 ఫలితాలతో పోలిస్తే 2014లో ఓట్ల శాతం 8.43 శాతం తగ్గగా, 2019లో మరో 8 శాతానికి పడిపోయింది. ఏప్రిల్ 30లోపు రాయ్‌బరేలీ మరియు అమేథీ అభ్యర్థులపై పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రెండో దశ పోలింగ్‌లో వయనాడ్‌కి ఏప్రిల్ 26న ఎన్నికలు జరిగిన తర్వాత వీటికి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అయితే, ఇది ముగిసిన తర్వాత అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసే అవకాశం ఉందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.