Varanasi court to deliver its verdict on plea seeking worship rights of ‘Shivling’ on Gyanvapi premises: జ్ఞానవాపి మసీదు కేసులో ఈ రోజు వారణాసి ఫాస్ట్ ట్రాక్ కోర్టు కీలక తీర్పు వెలువరించనుంది. హిందూ పక్షం మసీదులోని కొలనులో లభించిన ‘ శివలింగం ’ ఆకారాన్ని పూజించేందుకు అనుమతించాలని కోర్టును కోరింది. దీనిపై నేడు తీర్పును వెల్లడించనుంది. నవంబర్ 8న ఈ కేసు తీర్పును నవంబర్ 14కు వాయిదా వేసింది. హిందూ పక్షం శివలింగానికి పూజలతో పాటు, ముస్లింల ప్రవేశాన్ని నిషేధించాలని, జ్ఞానవాపి మసీదు సముదాయాన్ని హిందువులకు అప్పగించాలని కోరింది.
అయితే ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు మాత్రం శివలింగం బయటపడిన ప్రాంతాన్ని పరిరక్షించడంతో పాటు ముస్లింలు ప్రార్థన చేసుకునే అవకాశాన్ని కల్పించింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ ఆదేశాలు కొనసాగుతాయని నవంబర్ 11న తీర్పు చెప్పింది.
Read Also: Uttar Pradesh: ఎనర్జీ పిల్ వేసుకుని అఘాయిత్యం… ఆ తర్వాత ఏమైంది?
అంతకుముందు ఈ విషయంలో శివలింగం వయసు తెలుసుకునేందుకు కార్బన్ డేటింగ్ చేయాలని హిందూ పక్షం వారణాసికోర్టును కోరింది. అయితే ఈ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. వారణాసి సివిల్ కోర్టు ఆదేశాల మేరకు గతంలో జ్ఞానవాపి మసీదును వీడియో సర్వే చేశారు. దీంట్లో వాజూఖానాలో ఓ కొలనులో శివలింగం ఆకారం లభించింది. ఇది కాశీ విశ్వనాథుడి శివలింగమే అని హిందూ పక్షం చెబుతోంది. ఇదిలా ఉంటే ఇది కొలనులోని ఫౌంటేన్ అని ముస్లిం పక్షం వాదిస్తోంది. అయితే ఈ రోజు వారణాసి కోర్టు ఏం తీర్పు చెబుతుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది.
ముస్లింపక్షం గతంలో ఈ మసీదుకు ప్రార్థనా స్థలాల చట్టం-1991ని అమలు చేయాలని కోరింది. స్వాతంత్య్రం అనంతర ప్రార్థనా స్థలాల స్థితిని మార్చవద్దని ఈ చట్టం చెబుతుంది. అయితే జ్ఞానవాపి మసీదు కేసులో ఇది వర్తించదని వారణాసి కోర్టు స్పష్టం చేసింది. కాగా.. ముస్లిం తరుపు న్యాయవాది తౌహిద్ ఖాన్ మాట్లాడుతూ.. కోర్టు ఈ కేసును కొట్టి వేస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. మసీదు వెలుపలి గోడపై ఉన్న హిందూ దేవతల విగ్రహాలను రోజూ పూజించడానికి అనుమతికి సంబంధించి జిల్లా కోర్టులో ఉందని.. అయితే కొనసాగుతున్న కేసు మసీదుకు సంబంధించిందని ఆయన అన్నారు.