Best Tour Place : ఉత్తరాఖండ్‌ను దేవతల నివాసంగా అంటారు. ఆధ్యాత్మికత , ప్రకృతి అందాల కలయికతో ప్రతి సీజన్‌లో సందర్శించదగిన ప్రదేశం ఇది. వేసవిలో ఆహ్లాదకరమైన వాతావరణం, శీతాకాలంలో మంచు.. అన్నీ ఇక్కడే. ఉత్తరాఖండ్‌లో అడుగడుగునా కనువిందు చేసే అందమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి వెళ్తే మళ్లీ మళ్లీ వెళ్లాలనిపించే అటువంటి ప్రదేశాల్లో ఒకటి ‘పువ్వుల లోయ’ (వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్).
పువ్వుల లోయ సౌందర్యం
ఉత్తరాఖండ్ తన సహజ సౌందర్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. ఎత్తైన పర్వతాలు, అడుగడుగునా పచ్చదనం- అయితే, గర్హ్వాల్ ప్రాంతంలో ఉన్న పువ్వుల లోయ మరింత స్పెషల్. ఇది సంవత్సరంలో కేవలం 5 నెలలు (జూన్ నుంచి అక్టోబర్ వరకు) మాత్రమే పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. ఈ లోయలో 500 కంటే ఎక్కువ రకాల అందమైన పువ్వులు వికసిస్తాయి, అవి సందర్శకుల మనసును దోచుకుంటాయి.
పువ్వుల లోయ నందా దేవి బయోస్పియర్ రిజర్వ్‌లో భాగం. ఇది దాదాపు 87.5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది, పొడవు 8 కిలోమీటర్లు, వెడల్పు 2 కిలోమీటర్లు. ఈ ప్రదేశం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తింపు పొందింది. ఇక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్ర పుష్పం అయిన బ్రహ్మకమలం కూడా చూడవచ్చు, ఇది అసాధారణ అందంతో కనిపిస్తుంది.
Trivikram Srinivas: నాన్న నన్ను ఇంజనీరింగ్ చదివించలేను అన్నారు!
సందర్శనకు ఉత్తమ సమయం
పువ్వుల లోయను సందర్శించడానికి ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు ఉత్తమ సమయం. ఈ కాలంలో పువ్వులు పూర్తిగా వికసిస్తాయి, ప్రకృతి అందాలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి.
ఎలా చేరుకోవాలి?
ఢిల్లీ నుంచి పువ్వుల లోయకు దూరం దాదాపు 500 కిలోమీటర్లు, చేరుకోవడానికి సుమారు 12 గంటలు పడుతుంది. సొంత వాహనంలో లేదా సఫారీలో వెళ్లవచ్చు. ప్రత్యామ్నాయంగా, ఢిల్లీ నుంచి రిషికేశ్‌కు బస్సులో వెళ్లి, అక్కడి నుంచి జోషిమఠ్ చేరుకోవాలి. జోషిమఠ్ నుంచి 17 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి.
పర్మిట్ , ఫీజులు
పువ్వుల లోయలో అడుగుపెట్టాలంటే పర్మిట్ తప్పనిసరి. గంగారియా నుంచి పర్మిట్ తీసుకోవాలి, ఇది 3 రోజులు మాత్రమే చెల్లుతుంది. ట్రెక్కింగ్ ఫీజు.. భారతీయులకు రూ. 200, విదేశీ పర్యాటకులకు రూ. 800.
ఈ పువ్వుల లోయ ప్రకృతి ప్రేమికులకు స్వర్గం లాంటిది. ఒకసారి సందర్శిస్తే మరచిపోలేని అనుభవం మిగులుతుంది. పర్యాటకులు ఈ అందమైన ప్రదేశాన్ని సందర్శించి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలని సూచన.