NTV Telugu Site icon

Uttar Pradesh- Yogi: మదర్సాల్లో జాతీయగీతాన్ని తప్పనిసరి చేసిన యోగీ సర్కార్

Madarsa

Madarsa

ఉత్తర్ ప్రదేశ్ లోని యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ మదర్సాల్లో జాతీయగీతం ‘ జన గణ మన’ను తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని గురువారం నుంచి యూపీలోని అన్ని మదర్సాల్లో అమలు చేస్తోంది. అయితే ఉత్తర్ ప్రదేశ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డ్ మార్చి 24న జరిగిన సమావేశంలో అన్ని మదర్సాల్లో జాతీయ గీతం తప్పనిసరిగా పాడాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా ఈరోజు నుంచి అన్ని మదర్సాల్లో జాతీయ గీతాన్ని ఆలపించడం తప్పని సరి చేసింది. విద్యార్థులు తరగతి గదులకు వెళ్లే ముందు అందరూ కలిసి జాతీయ గీతాన్ని ఆలపించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గతంలో స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల్లోనే జాతీయ గీతాన్ని ఆలపించే వారు. అయితే యోగీ సర్కార్ మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బిగ్ డిసిషన్ తీసుకున్నారు.

రంజాన్ సెలవులు ముగిసిన తర్వాత మే 12 నుంచి తరగతులు ప్రారంభం అయ్యాయి. దీంతో ఈ రోజు నుంచే జాతీయ గీతం పాడటాన్ని తప్పనిసరిగా పాటించాలని సర్కార్ అన్ని మదర్సాలను ఆదేశించింది. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ధరంపాల్ సింగ్ గత నెలలో మదర్సాలలో జాతీయవాదాన్ని బోధించాలని ఆదేశించిన తర్వాత ప్రస్తుత జాతీయ గీతం తప్పని సరిపై ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉత్తర ప్రదేశ్ లో మొత్తం 16,461 మదర్సాలు ఉండగా… వీటిలో 560 మదర్సాలు ప్రభుత్వ గ్రాంట్లు పొందుతున్నాయి.

ఇదిలా ఉంటే యోగి ఆదిత్య నాథ్ మంత్రి వర్గంలో ఉన్న ఏకైక ముస్లిం మంత్రి డానిష్ ఆజాద్ అన్సారీ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ‘ ఇప్పుడు మదర్సాల్లోని విద్యార్థులు గణితం, సైన్స్ తో పాటు మత గ్రంథాలను కూడా చదువుతారు’ అంటూ వ్యాఖ్యానించారు. మదర్సాల్లోని విద్య మైనారిటీలకు చాలా అవసరం అని… వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు కీలకమని, జాతీయ గీతం ఆలపించేటప్పుడు విద్యార్థులు సమాజ విలువలు నేర్చుకుంటారని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే కొంతమంది ముస్లిం మత పెద్దలు మాత్రం మేము హమ్ద్ (అల్లాకు స్తోత్రాలు), సలామ్ ( అల్లాకు నమస్కారాలు) చేసి తరుగతులను ప్రారంభిస్తామని.. జాతీయ గీతం తప్పనిసరి కాదని వ్యతిరేకిస్తున్నారు.