NTV Telugu Site icon

Uttar Pradesh: అత్యాచారానికి పాల్పడ్డితే ఇక అంతే.. కొత్త బిల్లు తీసుకువచ్చిన యోగి సర్కార్

Yogi Adityanath

Yogi Adityanath

Uttar Pradesh has passed a bill to prevent anticipatory bail in rape cases: అత్యాచార నిందితులపై ఇక మరింత కఠినంగా వ్యవహరించనుంది ఉత్తర్ ప్రదేశ్ సర్కార్. అత్యాచార నిందితులకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని నిషేధించే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్( యూపీ సవరణ) బిల్లు-2022ను ఉత్తర్ ప్రదేశ్ శాసనసభ శుక్రవారం ఆమోదించింది. యూపీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి సురేష్ కుమార్ ఖన్నా సభలో మాట్లాడుతూ.. పోక్సో చట్టం, మహిళపై అఘాయిత్యాలకు సంబంధించిన నేరాలకు పాల్పడిన వారికి ముందస్తు బెయిల్ మంజూరు చేయకూడదనే నిబంధనలు విధించామని వెల్లడించారు.

ముందస్తు బెయిల్ తిరస్కరించడం వల్ల లైంగిక నేరాలకు పాల్పడిన వారు సాక్ష్యాలను ధ్వంసం చేయకుండా.. సాక్ష్యాలను తారుమారు చేయకుండా నివారించవచ్చని ఖన్నా అన్నారు. నిందితులు, బాధితురాలిని, ఇతర సాక్ష్యులను బెదిరించకుండా.. వేధించకుండా ఈ బిల్లు సహాయపడుతుందని వివరించారు. ఉత్తర్ ప్రదేశ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ(సవరణ) బిల్లును కూడా యూపీ అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం దావా వేయడానికి ఇప్పుడున్న మూడు నెలలను మూడేళ్ల వరకు పొడగిస్తుంది.

Read Also: Malakpet Accident: మూడురోజులుగా మృత్యువుతో పోరాడి శ్రావణి మృతి.. నిందితుడు అరెస్ట్‌

అల్లర్లలో ఎవరైనా చనిపోతే వారికి రూ. 5 లక్షల పరిహారం ఇచ్చేలా క్లెయిమ్ ట్రిబ్యునల్ కు ఈ సవరణ బిల్లు అధికారాన్ని కల్పించనుంది. బాధితుడికి దోషి నుంచి పరిహారం అందేలా.. సొమ్మును రికవరీ చేసేలా ఈ బిల్లు అధికారాన్ని కల్పిస్తోంది. ఆందోళనలు, అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన బాధితుడు వ్యక్తి పరిహారం కోసం అప్పీల్ చేసుకోవచ్చు. క్లెయిమ్ ట్రిబ్యునల్ అలాంటి కేసులను సుమోటోగా గుర్తించే హక్కు కూడా ఉంటుందని బిల్లులో పేర్కొన్నారు. ఇలాంటి కేసుల్లో పోలీసుల చర్యలకు అయ్యే ఖర్చును కూడా దోషులే భరించాలని బిల్లులో పేర్కొన్నారు. అల్లర్ల సమయంలో జరిగిన ఆస్తి నష్టాన్ని నిందితుడి నుంచి వసూలు చేయడానికి 2020లో యూపీ ప్రభుత్వం ‘‘ ఉత్తర్ ప్రదేశ్ పబ్లిక్, ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ రికవరీ యాక్ట్’ను తీసుకువచ్చింది. తాజాగా దీనికి సవరణలు చేశారు. ఈ బిల్లుల సమయంలో ప్రధాన ప్రతిపక్షం సమాజ్ వాదీ పార్టీ, దాని మిత్ర పక్షాలు గైర్హాజరు అయ్యాయి.