Site icon NTV Telugu

Trump “Gold Card”: ‘‘గోల్డ్ కార్డ్’’ పౌరసత్వం భారతీయులకు వరమా.? ట్రంప్ ఏమన్నారంటే..

Trump

Trump

Trump “Gold Card”: డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ పౌరసత్వాన్ని కొనుగోలు చేసే ‘‘గోల్డ్ కార్డ్’’ స్కీమ్‌ని ప్రకటించి, మరో సంచలనానికి తెరతీశారు. తాజాగా, ఈ గోల్డ్ కార్డ్ భారతీయులకు వరంగా ట్రంప్ చెబుతున్నారు. భారతదేశాల నుంచి వచ్చే తెలివైన విద్యార్థులను అమెరికాలోనే ఉంచేందుకు గోల్డ్ కార్డ్ పనిచేస్తుందని అన్నారు. వారిని నియమించుకునే కంపెనీలు గోల్డ్ కార్డ్‌ని కొనుగోలు చేయడం ద్వారా వారిని ఇక్కడే ఉంచొచ్చని ట్రంప్ చెప్పాడు.

కొత్తగా తీసుకువచ్చిన ‘‘గోల్డ్ కార్డ్’’ పౌరసత్వం కింద అమెరికన్ కంపెనీలు అమెరికన్ యూనివర్సిటీల నుంచి భారత గ్రాడ్యుయేట్లను నియమించుకోగలవని బుధవారం చెప్పారు. ప్రస్తుతం ఉన్న ఇమ్మిగ్రేషన్ పాలసీ అంతర్జాతీయ ప్రతిభ, ముఖ్యంగా భారతీయులు ఎలా అమెరికాలో ఉండకుండా చేసిందనే విషయాన్ని ట్రంప్ హైలెట్ చేశారు.

Read Also: Idli-making: ఇడ్లీల తయారీలో ప్లాస్టిక్ నిషేధం.. క్యాన్సర్ కారకమని మంత్రి హెచ్చరిక..

‘‘ఒక వ్యక్తి భారతదేశంలో, చైనా, జపాన్, అనేక ప్రాంతాల నుంచి హార్వర్డ్, వార్టన్ స్కూల్స్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు వెళతారు. వారికి ఉద్యోగ ఆఫర్లు వస్తాయి. కానీ ఆ వ్యక్తి యూఎస్‌లో ఉంటాడో లేదో అనే విషయం తెలియక ఆఫర్ వెంటనే రద్దు చేయబడుతుంది’’ అని ట్రంప్ అన్నారు. ఇలా అమెరికా నుంచి వెళ్లిన చాలా మంది వారి సొంత దేశాల్లో విజయవంతమైన ఎంటర్‌ప్రెన్యూర్లుగా మారారని చెప్పారు. ‘‘వారు ఇండియా వెళతారు, లేదా వారు వచ్చిన దేశానికి తిరిగి వెళ్లారు. అక్కడ కంపెనీ తెరుస్తారు. బిలియనీర్లు అవుతారు. వారు వేలాది మందికి ఉపాధి కల్పిస్తారు.’’ ఇలా అమెరికాలో ఆర్థిక అవకాశాలు మిస్ అవుతాయని ట్రంప్ అన్నారు. గోల్డ్ కార్డ్ అమెరికాలో ఇలాంటి ప్రతిభావంతులకు దీర్ఘకాలిక నివాసం, పౌరసత్వాన్ని అందిస్తుందని ట్రంప్ చెబుతున్నారు. దీనిని అమెరికా ఆదాయాన్ని పెంచే మరో మార్గంగా అభివర్ణించారు.

ట్రంప్ గోల్డ్ కార్డ్ స్కీమ్ ఏమిటి??

యూఎస్ పౌరసత్వాన్ని అమ్మడమే ‘‘గోల్డ్ కార్డ్’’ స్కీమ్. 5 మిలియన్ డాలర్లను చెల్లించడం ద్వారా ఈ గోల్డ్ కార్డ్ పౌరసత్వాన్ని పొందవచ్చు. ఇది చట్టబద్దమైన వలసకు కొత్త మార్గం చూపిస్తోంది. మంగళవారం దీనిని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం రెండు వారాల్లో ప్రారంభమవుతుందని ట్రంప్ చెప్పారు.

Exit mobile version