UP: రేపే యోగి కేబినెట్ విస్తరణ.. ఎన్నికల వేళ కొత్త ముఖాలకు ఛాన్స్!

  • రేపే యూపీ కేబినెట్ విస్తరణ
  • ఎన్నికల వేళ కొత్త ముఖాలకు ఛాన్స్!
  • మరోసారి అధికారం కోసం యోగి సర్కార్ ప్రయత్నం
Upcm

Upcm

వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మరోసారి అధికారం కోసం బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని ఛేజిక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. ఈ ప్రణాళికలో భాగంగానే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంత్రివర్గ విస్తరణకు సిద్ధమయ్యారు. ఆదివారం కేబినెట్ విస్తరణ జరగనుంది. అయితే విస్తరణలో కొత్త వారికే అవకాశం ఇవ్వొ్చ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం బీజేపీ మంచి జోష్‌లో ఉంది. పశ్చిమ బెంగాల్‌లో తొలిసారి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీహార్‌లో కూడా సమ్రాట్ చౌదరి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. ఇలాంటి తరుణంలో మరోసారి ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ఇప్పటి నుంచే బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ఆదివారం యోగి కేబినెట్ విస్తరణకు పూనుకున్నారు. విస్తరణలో ఆరుగురు కొత్త ముఖాలకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం సాయంత్రం గవర్నర్ ఆనందీబెన్ పటేల్‌తో సమావేశం కానున్నారు. ఈ సమావేశం సాయంత్రం 6:30 గంటలకు జరగనుంది. ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంలో ప్రస్తుతం మొత్తం 54 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో 21 మంది కేబినెట్ మంత్రులు, 14 మంది స్వతంత్ర బాధ్యతలు కలిగిన సహాయ మంత్రులు, 19 మంది సహాయ మంత్రులు ఉన్నారు. రాష్ట్రంలోని 403 అసెంబ్లీ స్థానాలకు గరిష్టంగా 60 మంది మంత్రులకు అవకాశం ఉంది. ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీ స్థానాలను కొత్త మంత్రులతో భర్తీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.