NTV Telugu Site icon

BJP: బీజేపీని దారుణంగా దెబ్బతీసిన యూపీ, రాజస్థాన్, మహారాష్ట్ర..

Bjp

Bjp

BJP: ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి లాండ్ స్లైడ్ విక్టరీ సాధించడం లేదు. గతం పోలిస్తే చాలా స్థానాల్లో బీజేపీకి గట్టి పోటీ ఎదురవుతోంది. ముఖ్యంగా ఢిల్లీలో అధికారం రావాలంటే ఉత్తర్ ప్రదేశ్ చాలా కీలకమైంది. అయితే, చాలా ఏళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ రాష్ట్రంలో ఆ పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. ఉత్తర్ ప్రదేశ్ మాత్రమే కాకుండా రాజస్థాన్, మహారాష్ట్రల్లో కూడా ఇండియా కూటమి సత్తా చాటుతోంది.

రామ మందిర నిర్మాణం ఉత్తర్ ప్రదేశ్‌లో కీలకంగా మారుతుందని అనుకున్నప్పటికీ, సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమి ఈ అంచనాలను తారుమారు చేసింది. 2014, 2019లో బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టిన యూపీ, ఈ సారి మాత్రం మార్పు కోరుకుంటున్నట్లు కనిపించింది. మొత్తం 80 ఎంపీ స్థానాలు ఉన్న ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఇండియా కూటమి 41 స్థానాల్లో, బీజేపీ 38 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతను కొనసాగిస్తోంది.

మరోవైపు రాజస్థాన్ రాష్ట్రంలోని 25 ఎంపీ సీట్లలో బీజేపీ 14 స్థానాల్లో, కాంగ్రెస్ కూటమి 10 స్థానాల్లో ఆధిక్యతను ప్రదర్శిస్తున్నాయి. ఐదు నెలల క్రితం రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఈ ఫలితాలు షాక్ ఇస్తున్నాయి. దీంతో పాటు మహారాష్ట్రలో 17 సీట్లలో ఎన్డీయే కూటమి లీడింగ్‌లో ఉండగా, 30 స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యతను కనబరుస్తోంది.