Zia Ur Rehman Barq: విద్యుత్ చౌర్యం కేసులో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్‌పై యూపీ విద్యుత్ శాఖ కేసు నమోదు చేశారు. నవంబర్ నెలలో సంభాల్‌లోని షాహీ జామా మసీదు సర్వే సమయంలో అధికారులపై దాడులు చేసిన ఘటనలో రెహ్మాన్ బార్క్ నిందితుడుగా ఉన్నాడు. అప్పటి నుంచి ఉత్తర్ ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్, ఆ ప్రాంతంలోని ఆక్రమణలను తొలగిస్తోంది. ఆ ప్రాంతంలో విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వ్యక్తులపై కేసులు పెడుతోంది. ఈ నేపథ్యంలోనే ఎంపీ ఇంటికి కూడా మీటర్ లేదని యూపీ అధికారులు గుర్తించారు. యూపీ విద్యుత్ శాఖ బార్క్‌ని 15 రోజుల్లో రూ. 1.9 కోట్లు జరిమానా చెల్లించాలని లేదా ప్రాపర్టీని అటాచ్‌మెంట్ చేయాలని కోరింది.
Read Also: PM Modi: నా కుటుంబం కోసమే రోజుకు 12 గంటలు పని చేస్తున్నా.. మోడీ కీలక వ్యాఖ్యలు
సంభాల్‌లోని దీపా సరాయ్ పరిసరాల్లోని జియా ఉర్ రెహ్మాన్ బార్క్ నివాసంలో విద్యుత్ చౌర్యం జరిగినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యుత్ మీటర్ ట్యాంపరింగ్ జరిగిందన్న అనుమానాల నేపథ్యంలో గురువారం విద్యుత్ శాఖ భారీ బందోబస్తుతో బార్క్ నివాసంలో సోదాలు నిర్వహించింది. తనిఖీల్లో రెండు విద్యుత్ మీటర్లలో అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. ఇంట్లో ఏసీలు, సీలింగ్ ఫ్యాన్లు, ఇతర విద్యుత్ ఉపకరణాలు ఉన్నా గత ఏడాది విద్యుత్ బిల్లు మాత్రం జీరోగా వచ్చినట్లు తేలింది. విద్యుత్ శాఖ ఎంపీ నివాసంలో పాత మీటర్లను తొలగించింది, వీటిని లాబోరేటరీకి పంపించింది.
ఈ కేసులో సమాజ్‌వాదీ ఎంపీ తండ్రి మమ్లుక్ ఉర్ రెహ్మాన్ బార్క్‌పై నఖాసా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. తనఖీల సమయంలో విద్యుత్ అధికారుల్ని బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 352, 351(2), మరియు 132 కింద కేసులు బుక్ అయ్యాయి.