NTV Telugu Site icon

Honeytrap: యూపీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వివరాలు లీక్.. పాకిస్తాన్ ఐఎస్ఐ హనీట్రాప్..

Up Ordnance Factory

Up Ordnance Factory

Honeytrap: ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక వ్యక్తి, ఫ్యాక్టరీకి చెందిన సున్నిత వివరాలను పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి లీక్ చేసినట్లు తెలుస్తోంది. ‘‘హానీ ట్రాప్’’లో చిక్కుకున్న అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న హ్యాండ్లర్లతో రహస్య సైనిక సమాచారాన్ని పంచుకున్నారని ఆరోపిస్తూ ఉత్తర ప్రదేశ్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (UP ATS) ఆగ్రాకు చెందిన రవీంద్ర కుమార్‌తో పాటు అతడి సహాయకుడిని అరెస్ట్ చేసింది.

అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం.. రవీంద్ర కుమార్ ఫిరోజాబాద్‌లోని హజ్రత్‌పూర్‌కి చెందిన ఆర్డినెస్స్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. సున్నితమైన పత్రాలను ఇతడు యాక్సెస్ చేశాడు. రోజూవారీ ఉత్పత్తుల నివేదిక, స్క్రీనింగ్ కమిటీ నుంచి వచ్చిన లెటర్స్, పెండింగ్‌లో ఉన్న రిక్వెస్ట్‌ల జాబితా, డ్రోన్లు, గగన్‌యాన్ ప్రాజెక్ట్ వివరాలతో సహా అత్యంత రహస్యమైన సమాచారాన్ని అతడు ఐఎస్ఐతో సంబంధం ఉన్న మహిళతో పంచుకున్నట్లు దర్యాప్తులో తేలింది.

Read Also: Minister Nimmala Ramanaidu: జూన్ నాటికల్లా లబ్దిదారులకు టిడ్కో ఇళ్లు..

నేహా శర్మగా నటిస్తున్న ఒక మహిళ ఏడాది క్రితం ఫేస్‌బుక్ ద్వారా రవీంద్రకు పరిచయమైంది. తాను పాకిస్తాన్ నిఘా సంస్థలో పనిచేస్తున్నానని వెల్లడించినప్పటికీ, ఆమె అతడిని హనీ ట్రాప్‌లోకి లాగగలిగింది. రవీంద్ర తన లావాదేవీల వివరాలను దాచడానికి చందన్ స్టోర్ కీపర్ 2 పేరుతో ఆమె నెంబర్‌ని సేవ్ చేసుకున్నాడని దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. డబ్బు ఆశకు ప్రేరేపించబడిన రవీంద్ర, ఆమెకు వాట్సాప్ ద్వారా రహస్య పత్రాలను పంపాడు. సోదాల్లో యూపీ ఏటీఎస్ రవీంద్ర మొబైల్ నుంచి సున్నితమైన సమాచారాన్ని కనుగొన్నారు. వాటిలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మరియు 51 గూర్ఖా రైఫిల్స్ రెజిమెంట్ సీనియర్ అధికారులు నిర్వహించిన లాజిస్టిక్స్ డ్రోన్ ట్రయల్స్ గురించి రహస్య వివరాలు ఉన్నాయి. అతను పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఐఎస్ఐ నిర్వాహకులతో ప్రత్యక్ష సంభాషణను కొనసాగించాడని, భారతదేశ రక్షణ ప్రాజెక్టులకు సంబంధించిన నిఘా సమాచారాన్ని అందజేశాడని అధికారులు చెబుతున్నారు.