NTV Telugu Site icon

YouTube: ‘‘యూట్యూబ్’’ చూసి సొంతగా ఆపరేషన్ చేసుకున్న యువకుడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Up News

Up News

YouTube: యూట్యూబ్‌లో చూసి సొంత వైద్యం చేసుకుంటే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఉత్తర్ ప్రదేశ్ మధురలో ఓ వ్యక్తి, తన కడుపు నొప్పికి సొంతగా ‘‘ఆపరేషన్’’ చేసుకోవడానికి ప్రయత్నించాడు. యూట్యూబ్‌లో చూస్తూ, తనకు తాను సర్జరీ చేసుకోవడానికి ప్రయత్నించి ప్రాణాలు మీదకు తెచ్చుకున్నాడు.

32 ఏళ్ల రాజా బాబు అనే వ్యక్తి, తన కడుపు నొప్పి కోసం అనేక మంది వైద్యుల్ని సంప్రదించాడు. అయినప్పటికీ ఉపశమనం లభించలేదు. అయితే, చివరకు తనకు తానే ఆపరేషన్ చేసుకోవాలని యూట్యూబ్ సాయంతో ప్రయత్నించాడు. చివరకు ప్రాణాపాయంతో ఆస్పత్రిలో చేరాడు. యూట్యూబ్‌లో అనేక వీడియోలు చూసిన తర్వాత, ఒక మెడికల్ స్టోర్‌కి వెళ్లి మందులు కొనుక్కుని, ఆన్‌లైన్‌ చూసిన విధంగా తనకు తాను శస్త్రచికిత్స చేసుకోవడానికి ప్రయత్నించాడు. పరిస్థితి విషమించడంతో, అతడిని కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

Read Also: Allahabad HC: వక్షోజాలు పట్టుకోవడం, పైజామా తాడు తెంచడం అత్యాచారం కాదు, కానీ..

రాజా బాబు తన కడుపు నొప్పి భరించలేనిదిగా మారినప్పుడు సొంత చికిత్స చేసుకోవాలని ప్రయత్నించాడు. మధురలో సర్జికల్ బ్లేడ్, కుట్లు వేసేందుకు సామాగ్రి, మత్తు ఇంజెక్షన్ కొన్నాడు. బుధవారం ఉదయం అతను తన గదిలో ఆపరేషన్ ప్రారంభించాడు. కొంతసేపటికి తర్వాత, అనస్థీషియా ప్రభావం తగ్గటంతో తీవ్రమైన నొప్పితో అరుస్తూ బయటకు వచ్చాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. దాదాపు 18 ఏళ్ల క్రితం రాజా బాబుకి అపెండిక్స్ సర్జరీ జరిగింది. అతను గత కొన్ని రోజులుగా నొప్పితో బాధపడుతున్నాడు. ప్రస్తుతం, సొంత ఆపరేషన్ తర్వాత అతడి పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఆగ్రాలోని ఎస్ఎన్ ఆస్పత్రికి తరలించారు.