NTV Telugu Site icon

Mamata Banerjee: కుంభమేళా తొక్కిసలాట మృతుల సంఖ్యను యోగీ సర్కార్ చెప్పడం లేదు..

Umamata

Umamata

Mamata Banerjee: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటపై బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆమె మీడియాతో బుధవారం మాట్లాడారు. ‘‘మహా కుంభమేళాలో చాలా మంది మరణించారు. కానీ సరైన సంఖ్యని చెప్పడం లేదు. వారు కుంభమేళాకి హైప్ పెంచారు. అందుకు తగ్గట్లుగా సౌకర్యాలు చేయలేదు. పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించారు. కానీ వేదికల వద్ద సరైన ఏర్పాట్లు చేయలేదు’’ అని ఆరోపించారు.

గత నెలలో అమృత స్నానం సమయంలో భారీ ఎత్తున భక్తులు రావడంతో తొక్కిసలాట జరిగింది. దీంట్లో 30 మంది భక్తులు మరణించగా, 60 మంది గాయపడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ దీనిపై విచారణకు జ్యుడిషియల్ కమిటీని నియమించింది. మరోవైపు రాష్ట్ర పోలీసులు కుట్ర కోణం ఏదైనా ఉందా..? అని విచారణ జరుపుతున్నారు.

Read Also: Maruti Suzuki eVITARA: లాంచ్‌కు ముందే డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకున్న ఈ-విటారా.. వెళ్లి చెక్‌ చేసుకోండి..

ఇదిలా ఉంటే, కేంద్రం బెంగాల్ ‌కి బకాయులను విడుదల చేయడంలో విఫలమైందని, రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని ఇవ్వడం లేదని మమతా బెనర్జీ ఆరోపించారు. బెంగాల్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలకు కూడా ముఖ్యమంత్రి ప్రతిస్పందిస్తూ.. ఇది పక్షపాతం, వాస్తవం కాదని ఆమె అన్నారు. బెంగాల్‌కి వ్యతిరేకంగా నిర్మలా సీతారామన్ ప్రకటన ఉందని అన్నారు. మంగళవారం సీతారామన్ అధికార పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, తృణమూల్ కాంగ్రెస్ దోపిడీకి మారుపేరుగా మారిందని, ఆ పార్టీ అవినీతిని పెంచిందని, సంస్థలను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.

2026లో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ టర్మ్‌లో చివరిదైన బడ్జెట్‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య బుధవారం ప్రవేశపెట్టారు. రూ. 3.89 లక్షల కోట్ల బడ్జెట్‌ని సమర్పించారు. రాష్ట్ర ఉద్యోగులకు 4 శాతం డీఏని పెంచారు. వ్యవసాయ, గ్రామీణ రంగాలకు అధికంగా నిధులు కేటాయించారు.