UP Girl Who Declared As Dead 7 Years Ago Found Alive In Hathras: అప్పుడప్పుడు కొన్ని ఊహకందని షాకింగ్ సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇప్పుడు మనం అలాంటి ఘటన గురించే మాట్లాడుకోబోతున్నాం. 2015లో హత్యకు గురైందనుకున్న ఓ యువతి.. ఏడేళ్ల తర్వాత తిరిగి సజీవంగా కనిపించింది. పాపం.. ఈ కేసులో ఓ యువకుడు ఎలాంటి తప్పు చేయకపోయినా, జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. తన కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని నమ్మిన అతని తల్లి.. ఎంతో శ్రమించి ఈ మిస్టరీని ఛేదించింది. ఒక త్రిల్లర్ సినిమాని తలపించే ఈ కేసు వివరాల్లోకి వెళ్తే..
2015లో ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ ప్రాంతానికి చెందిన ఓ 15 ఏళ్ల బాలిక అనుకోకుండా అదృశ్యమైంది. దీంతో ఆ బాలిక తండ్రి.. విష్ణు అనే 18 ఏళ్ల యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లి పేరుతో మాయమాటలు చెప్పి, విష్ణు తన కూతురిని కిడ్నాప్ చేశాడని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో.. పోలీసులు విష్ణుపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. తాను కిడ్నాప్ చేయలేదని విష్ణు ఎంత మొత్తుకున్నా.. పోలీసులు వినలేదు. ఆమ్మాయిని ఎక్కడ దాచిపెట్టాడో చెప్పు అంటూ అతడ్ని చిత్రహింసలకు గురి చేశారు. ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి. కట్ చేస్తే.. ఆగ్రాలో పోలీసులకు ఒక బాలిక మృతదేహం లభించింది. అది తన కుమార్తె మృతదేహమేనని తండ్రి చెప్పడంతో.. విష్ణుపై హత్య కేసు నమోదు చేసి, అతడ్ని జైలుకు పంపించారు. అయితే.. విష్ణు తల్లి మాత్రం తన కుమారుడు ఏ తప్పు చేయలేదని గట్టిగా నమ్మింది. తన ఆవేదన పోలీసులు వినిపించుకోకపోవడంతో.. తానే రంగంలోకి దిగి, ఈ కేసు దర్యాప్తు చేపట్టింది.
కనిపించకుండా పోయిన ఆ బాలిక ఆచూకీ కోసం వెతకడం మొదలుపెట్టింది. ఎట్టకేలకు.. ఏడేళ్ల తర్వాత ఆ తల్లి శ్రమ ఫలించింది. హత్రాస్‌లో ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొనడానికి విష్ణు తల్లి వెళ్లింది. అక్కడ ఆమెకు 22 ఏళ్ల వయసున్న ఓ యువతి కనిపించింది. ఏడేళ్ల క్రితం తప్పిపోయిన బాలికే అని నిర్ధారించుకొని.. సమాచారాన్ని పోలీసులకు అందింది. దీంతో.. పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకొని, సోమవారం అలీగఢ్ కోర్టులో ప్రవేశపెట్టి, మంగళవారం మెజిస్ట్రేట్ ముందు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. డీఎన్ఏ టెస్ట్ నిర్వహించి, తండ్రి డీఎన్ఏతో పోల్చి చూస్తామని.. రిపోర్టులు వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ట్విస్ట్ ఏమిటంటే.. ఆ యువతికి పెళ్లయి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తన ప్రియుడితో కలిసి పారిపోవడానికి, ఆ యువతి విష్ణుని బలిపశువుని చేసింది.