UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!

  • 2027 యూపీ ఎన్నికల ముందు ఎస్పీ–కాంగ్రెస్ సీట్ల రచ్చ
  • కనీసం 150 సీట్లలో పోటీ చేయాలని కాంగ్రెస్ డిమాండ్
  • 150 సీట్లు ఇవ్వడం అటుంచి 50 సీట్లు కూడా పెద్ద విషయమే అన్న ఎస్పీ ఎంపీ
  • పార్టీల రాజకీయ బలం ఆధారంగా సీట్ల పంపకం జరగాలన్న పటేల్
Up Politics

Up Politics

UP Election: 2027 ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల వేళ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)-కాంగ్రెస్ మధ్య సీట్ల లెక్కల్లో విభేదాలు తలెత్తుతున్నాయి. రెండు పార్టీల మధ్య సీట్ల బేరాలు కుదరడం లేదు. కాంగ్రెస్ ఎక్కువ సీట్లను డిమాండ్ చేయడంపై ఎస్పీ నేతలు ఫైర్ అవుతున్నారు. రాష్ట్రంలోని 403 స్థానాల్లో కనీసం 150 సీట్లలో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, ఈ ప్రతిపాదనను ఎస్పీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తాజాగా కాంగ్రెస్ తీరుపై ఎస్పీ ఎంపీ ఎస్పీ సింగ్ పటేల్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌కు 150 సీట్లు ఇవ్వడం అటుంచి, 50 సీట్లు కూడా ఇవ్వడం పెద్ద విషయమే అని అన్నారు. యూపీలో కాంగ్రెస్‌కు క్షేత్రస్థాయిలో ఉన్న బలం, ఎంపీలు-ఎమ్మెల్యేల సంఖ్యను పరిగణలోకి తీసుకోవాలని అన్నారు.

కాంగ్రెస్ యూపీ ఇన్‌చార్జ్ రాజేంద్ర పాల్ గౌతమ్ ఇటీవల మాట్లాడుతూ.. 2027 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 150 సీట్లకు తగ్గకుండా పోటీ చేయాలనుకుంటోంది అని అన్నారు. 403 సీట్లలో 50 శాతం సీట్లకు కాంగ్రెస్ హక్కుదారుగా ఉందని ఆయన అన్నారు. సీట్ల పంపకంపై అక్టోబర్‌లో క్లారిటీ రావొచ్చని అన్నారు. కాంగ్రెస్ ఈ ప్రతిపాదన ఎస్పీ నేతలకు రుచించడం లేదు.

ఎస్పీ సింగ్ పటేల్ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. రాయ్‌బరేలీలో తొలుత పోటీ చేయడానికి సిద్ధపడలేదని, అఖిలేష్ యాదవ్ ఒప్పించడంతో చివరకు పోటీ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ అక్కడి నుంచి పోటీ చేయకపోతే ఎస్పీ పోటీ చేసేదని అన్నారు. కాంగ్రెస్‌కు గత ఎంపీ ఎన్నికల్లో ఎస్పీ వల్ల ప్రయోజనం చేకూరిందని అన్నారు.