Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కన్వర్ యాత్రికుల కోసం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కన్వర్ యాత్ర రూట్లలోని హోటళ్లు నేమ్ ప్లేట్స్ ప్రదర్శించాల్సిందేనని యూపీ సీఎం స్పష్టం చేశారు. యాత్రికుల విశ్వాసాలను గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని సీఎంఓ తెలిపింది. ఇదే విషయమై ముజఫర్‌నగర్ పోలీసులు ఇటీవల ఇచ్చిన ఆదేశాలు తీవ్ర రాజకీయ వివాదానికి దారి తీశాయి. అయినా సరే ఉత్తరప్రదేశ్ సర్కార్ వెనక్కి తగ్గకపోవడం గమనార్హం.
Read Also: Telangana Assembly: 23 నుంచి అసెంబ్లీ భేటీ.. 25న బడ్జెట్..
అయితే, దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నప్పటికీ, కన్వర్ మార్గంలోని షాపులపై యజమానులు, అక్కడ పని చేస్తున్న వారి పేర్లను రాయాలని యోగి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా హలాల్ సర్టిఫికేషన్ ఉన్న ఉత్పత్తులను విక్రయిస్తున్న వారిపై కూడా చర్యలు తీసుకోవాలని వెల్లడించింది. అయితే, యూపీ ప్రభుత్వ తీరుపై కేంద్ర ప్రభుత్వంలోని ముఖ్యమైన సభ్యులు, జేడీయూ నేత కేసీ త్యాగి, బీజేపీ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ఖండించారు. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, మాయావతి, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ యోగి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు సాకేత్ గోఖలే జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు లేఖ రాశారు.. పోలీసుల ఉద్దేశాలు మంచివి కావు, ఈ ఉత్తర్వులు మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తులపై వివక్ష చూపుతుందని అందులో పేర్కొన్నారు.