NTV Telugu Site icon

UP By Election: అల్లరి మూకలకు ఎస్పీ చీఫ్ అఖిలేష్‌ యాదవ్ వార్నింగ్..

Akilesh

Akilesh

UP By Election: ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలోని తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ ఈరోజు నేటి (బుధవారం) ఉదయం నుంచి కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటిన సమాజ్‌ వాదీ పార్టీ ఈ ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తామని గంపెడాశలు పెట్టుకుంది. తాజాగా పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఒక్క ఓటు కూడా వృథా కానప్పుడే సంపూర్ణ ఫలితాలు వస్తాయన్నారు. యూపీలోని ఓటర్లు తమ ఓటు హక్కును 100 శాతం వినియోగించుకునేందుకు తమ ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈసీ నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తుందని అనుకుంటున్నాం.. ఎన్నికల్లో ఎవరూ అల్లర్లకు పాల్పడకూడదని పేర్కొన్నారు. తమ కార్యకర్తలు అన్ని బూత్‌లను పరిశీలిస్తున్నారు.. అన్ని చోట్లా వీడియోగ్రఫీ కొనసాగుతుందన్నారు. ఇలాంటి వారికి ప్రజా చైతన్యమే హెచ్చరిక అని అఖిలేష్ యాదవ్ తెలిపారు.

Read Also: Deputy CM Pawan Kalyan: ఉద్ధానంలోనే కాదు రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో కిడ్నీ బాధితులు..

ఇక, యూపీలోని మిరాపూర్, కుందర్కి, ఘజియాబాద్, ఖైర్ , కర్హల్, సిసామావు, ఫుల్‌పూర్, కతేహరి, మజ్వాన్ స్థానాలకు ఉప ఎన్నిక కొనసాగుతుంది. ఓటింగ్ ప్రక్రియ ఈరోజు సాయంత్రం 5గంటల వరకు కొనసాగుతుందని ఎలక్షన్ కమిషన్ పేర్కొనింది. బైపోల్ కోసం మొత్తం 1917 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీగా పారామిలటరీ బలగాలను మోహరించింది. ఉప ఎన్నికల్లో 18.46 లక్షల మంది పురుషులు, 15.88 లక్షల మందికి పైగా మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బైపోల్ ఫలితాలు నవంబర్ 23వ తేదీన వెలువడనున్నాయి.