Site icon NTV Telugu

Shahzad: మరో పాక్ గూఢచారి షాజాద్‌ అరెస్ట్

Shahzad

Shahzad

భారత్‌లో పుట్టి దేశ ద్రోహానికి పాల్పడ్డ పాక్ గూఢచారుల భరతాన్ని అధికారులు చీల్చి చెండాడుతున్నారు. యూట్యూబర్ల ముసుగులో భారత రక్షణ సమచారాన్ని పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్‌కు చేరవేసిన హర్యానాకు చెందిన జ్యోతి మల్హోత్రాతో పాటు పూరీకి చెందిన మరో యూట్యూబర్‌ ప్రియాంక సేనాపతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌కు చెందిన వ్యాపారవేత్త షాజాద్‌ను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మొరాదాబాద్‌లో అరెస్ట్ చేశారు. భారత రక్షణ సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేశాడన్న ఆరోపణలతో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Bill Gates: 2045 నాటికి మెరుగైన ప్రపంచం కోసం బిల్ గేట్స్‌ ఛాలెంజ్‌.. 200 బిలియన్‌ డాలర్ల సాయం..!

షాజాద్ గత కొన్నేళ్లుగా పాకిస్థాన్‌కు అనేకసార్లు వెళ్లాడు. సరిహద్దు మీదగా బట్టలు, సుగంధ ద్రవ్యాలు, ఇతర వస్తువులు అక్రమంగా రవాణా చేస్తున్నట్లుగా గుర్తించారు. వ్యాపారం ముసుగులో భారత రహస్యాలను పాకిస్థాన్ ఐఎస్ఐ‌కు చేరవేసినట్లుగా కనుగొన్నారు. ఐఎస్ఐ ఏజెంట్లకు షాజాద్‌ డబ్బు, భారతీయ సిమ్‌ కార్డులు అందించినట్లు దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా ఐఎస్ఐ కోసం పని చేయడానికి రాంపూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలను పాకిస్థాన్‌కు పంపించినట్లుగా గుర్తించారు. వీళ్లందరికి వీసాలను ఐఎస్ఐ ఏజెంట్లు ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పూరీ పర్యటనపై పోలీసుల విచారణ..!

పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసినందుకు హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు. ‘‘ట్రావెల్ విత్ JO’’ అనే యూట్యూబ్ ఛానల్‌ను జ్యోతి మల్హోత్రా నడుపుతోంది. మూడు లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉన్నారు. ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌లో పనిచేస్తున్న ఒక పాకిస్తానీ ఉద్యోగితో ఆమె సంప్రదింపులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. మే 13న గూఢచర్యానికి పాల్పడుతున్నాడని ఆ పాకిస్తాన్ అధికారిని భారతదేశం బహిష్కరించింది. ఇక ఆమె తన పాకిస్థాన్ పర్యటనకు సంబంధించిన కొన్ని వీడియోలను యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసింది. ‘‘పాకిస్తాన్‌లో భారతీయ అమ్మాయి’’, ‘‘లాహోర్‌ను అన్వేషించే భారతీయ అమ్మాయి’’, ‘‘కటాస్ రాజ్ ఆలయంలో భారతీయ అమ్మాయి’’, ‘‘పాకిస్తాన్‌లో లగ్జరీ బస్సులో భారతీయ అమ్మాయి ప్రయాణించింది’. ఇలా టైటిల్స్ పెట్టి అనేక వీడియోలు పోస్ట్ చేసింది. అయితే జ్యోతి మల్హోత్రా పూరీలో కూడా ప్రయాణం చేసింది. అక్కడి యూట్యూబర్ ప్రియాంక సేనాపతితో సంబంధం కలిగి ఉంది. ప్రస్తుతం ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మృతి చెందారు. అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల మధ్య ఈ అరెస్ట్‌లు జరుగుతున్నాయి. వీళ్లంతా పహల్గామ్ ఉగ్ర దాడి సమయంలో ఉన్నట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.

Exit mobile version