NTV Telugu Site icon

Ramdas Athawale: ఫడ్నవిస్‌ సీఎం అయ్యే ఛాన్స్.. కేంద్రమంత్రి వ్యాఖ్య

Ramdasathawale

Ramdasathawale

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ అవుతారని వ్యాఖ్యానించారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ మద్దతుతో ఫడ్నవిస్ సీఎం కాబోతున్నారని చెప్పుకొచ్చారు. దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అనంతరం అథవాలే ఈ వ్యాఖ్యలు చేశారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నుంచే ప్రకటన రావాల్సి ఉందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: I.N.D.I.A Alliance: మహారాష్ట్ర ఓటమితో అలిగిన టీఎంసీ.. ఆ బాధ్యత మమతా బెనర్జీకి ఇవ్వాలని డిమాండ్

ముఖ్యమంత్రి పదవిపై మరో రెండు మూడు రోజుల్లో నిర్ణయం వెలువడుతుందని చెప్పారు. త్వరలో ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుందని, ఆర్‌పీఐ-ఏకి కేబినెట్‌ బెర్త్‌ దక్కుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఫడ్నవిస్‌తో జరిపిన చర్చల్లో కేబినెట్ ఏర్పాటుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలోనే ప్రమాణస్వీకారంపై క్లారిటీ రానుందని చెప్పారు. తమ పార్టీకి కేబినెట్ బెర్త్ ఖాయమని వెల్లడించారు. బీజేపీకి సొంతంగా 132 సీట్లు వచ్చాయని.. ఇక ఎన్సీపీ 41 సీట్ల మద్దతు అందించారని గుర్తుచేశారు. ఏక్‌నాథ్ షిండేతో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయన్నారు. శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే ఛాన్సుందని అథవాలే అన్నారు.

ఇది కూడా చదవండి: Bengal Tiger Dies in Tirupati Zoo: తిరుపతి జూ లో మరో బెంగాల్ టైగర్ మృతి..

ఆదివారం శివసేన ఎమ్మెల్యేలంతా ఏక్‌నాథ్ షిండేను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలంతా షిండేను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు. బీహార్ ఫార్ములా అమలు చేయాలని కోరారు. బీహార్‌లో నితీష్ కుమార్‌కు సంఖ్యాబలం లేకపోయినా.. ముఖ్యమంత్రి సీటులో కూర్చుకున్నారు. అదే తరహా సిద్ధాంతాన్ని మహారాష్ట్రలో కూడా అమలు చేయాలని షిండే వర్గ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కానీ బీజేపీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయలేదని సమాచారం.

ఇదిలా ఉంటే అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీకి 41 అసెంబ్లీ సీట్లు వచ్చాయి. దీంతో ఆ పార్టీ ఇప్పటికే బీజేపీ ముఖ్యమంత్రికి మద్దతు ప్రకటించేశారు. దీంతో ఈజీగా శివసేన మద్దతు లేకుండా సొంతంగా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. ఈ నేపథ్యంలోనే షిండే ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేయడం లేదని.. మౌనంగా ఉన్నారంటూ పొలిటికల్ సర్కిల్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కేవలం డిప్యూటీ సీఎం పదవి తీసుకుని సరిపెట్టుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి పీఠం బీజేపీకి దక్కే ఛాన్సుంది. ఇక దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్.. బీజేపీ పెద్దలతో ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 132, షిండే శివసేనకు 57, అజిత్ పవార్ ఎన్సీపీకి 41, ఉద్ధవ్ థాకరే పార్టీకి 20, కాంగ్రెస్‌కు 16, శరద్ పవార్ పార్టీకి 10, ఎస్పీకి 2, ఇతరులకు 10 సీట్లు వచ్చాయి. మొత్తం రాష్ట్రంలో 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.