NTV Telugu Site icon

Union Minister Raksha Khadse: కేంద్ర మంత్రి కుమార్తె్కు వేధింపులు.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు

Union Minister Raksha Khads

Union Minister Raksha Khads

దేశంలో మహిళలపై వేధింపులు ఎక్కువైపోతున్నాయి. మహిళా రక్షణ కోసం కఠిన చట్టాలను తీసుకొస్తున్నప్పటికీ దారుణాలకు అడ్డుకట్ట పడడం లేదు. కొన్ని రోజుల క్రితం పూణేలో ఆగి ఉన్న బస్సులో ఓ మహిళపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈకేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా మహారాష్ట్రలో కేంద్ర మంత్రి కుమార్తెను కొందరు ఆకతాయిలు వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. మహాశివరాత్రి జాతరలో తన కుమార్తెను కొంత మంది యువకులు వేధించారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కేంద్ర యువజన వ్యవహారాల సహాయ మంత్రి రక్షా ఖడ్సే ఆదివారం తెలిపారు. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలోని ముక్తాయ్ నగర్ ప్రాంతంలో ఈఘటన చోటుచేసుకుంది.

Also Read:V. Hanumantha Rao: వీహెచ్‌ తీరుపై ఏఐసీసీ ఆగ్రహం.. స్పందించిన హనుమంతరావు..

ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా మా ప్రాంతంలో సంత్ ముక్తాయ్ జాతర జరుగుతుంది. రెండు రోజుల క్రితం నా కూతురు జాతరకు వెళ్ళింది. అక్కడ కొంతమంది యువకులు ఆమెను వేధించారు. వారిపై ఫిర్యాదు చేయడానికి నేను పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను” అని రక్షా ఖడ్సే మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో మంత్రుల కుటుంబాలు కూడా సురక్షితంగా లేనప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటీ? అని కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

Also Read:Harish Rao : సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి హరీష్‌రావు బహిరంగ లేఖ..

రక్షా ఖడ్సే మామ, మాజీ మంత్రి ఏక్‌నాథ్ ఖడ్సే మాట్లాడుతూ.. “ఈ యువకులపై పోలీసులకు గతంలో అనేక ఫిర్యాదులు అందాయి. ఈ అబ్బాయిలు కరుడుగట్టిన నేరస్థులు. మహారాష్ట్రలో మహిళలపై నేరాలు పెరిగాయి. నేరస్థులు పోలీసులకు భయపడరు. అమ్మాయిలు ఫిర్యాదులు చేయడానికి ముందుకు రారు. తల్లిదండ్రులు తమ కూతుళ్ల పేర్లు వెల్లడించడానికి వెనకాడతారు. మాకు వేరే మార్గం లేకపోవడంతో మేము పోలీసులకు ఫిర్యాదు చేసాము” అని అన్నారు.

Also Read:SLBC Tunnel: టన్నెల్‌లో రెస్క్యూ ఆపరేషన్స్‌కి తీవ్ర ఆటంకం..

ముక్తాయ్ నగర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కుషానత్ పింగ్డే మాట్లాడుతూ.. నిందితులు చాలా మంది బాలికలతో దురుసుగా ప్రవర్తించారని తెలిపారు. అడ్డుకోబోయిన పోలీస్ సిబ్బందితో ఘర్షన పడ్డారని ఆయన అన్నారు. ఈ కేసులో ఆయన ఏడుగురు నిందితుల పేర్లను వెల్లడించారు. వారిలో ఒకరిని అరెస్టు చేశామన్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా లైంగిక వేధింపులు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని చెప్పారు.