Nitin Gadkari: కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఒక్క రూపాయి కమీషన్ తీసుకున్నట్లు ఎవరైనా నిరూపిస్తే.. రాజకీయాల నుంచి వైదొలుగుతానని సవాల్ విసిరారు. రాజకీయాలంటే డబ్బులు సంపాదించే వ్యాపారం కాదని కేంద్ర మంత్రి గడ్కరీ అన్నారు. కులం, మతం, భాష ఆధారంగా వ్యక్తులు గొప్పవారు కారని.. కేవలం వ్యక్తిత్వం, లక్షణాలే వారి గొప్పతనాన్ని నిర్ణయిస్తాయన్నారు. ముంబయిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ వ్యా ఖ్యలు చేశారు. ఇతరుల నుంచి కమీషన్ తీసుకోవాల్సిన అవసరం తనకు లేదని..యూట్యూబ్ ఛానెల్ నుంచే నెలకు రూ.3 లక్షల ఆదాయం వస్తుందని స్పష్టం చేశారు.
Read also:
‘‘దేశంలో ఏ ఒక్కరైనా నితిన్ గడ్కరీకి ఒక్క రూపాయి కమీషన్ ఇచ్చినట్లు నిరూపిస్తే.. నేను రాజకీయాల నుంచి వైదొలుగుతా. రాజకీయాలంటే డబ్బులు సంపాదించే వ్యాపారం కాదు. నాకు ఎవరి నుంచి కమీషన్ తీసుకోవాల్సిన అవసరంలేదు. నేను హిందీ, మరాఠీ, ఇంగ్లీష్‌లో చేసిన ప్రసంగాలను యూట్యూబ్‌లో చాలా మంది చూస్తారు. అమెరికాలో ఎక్కువ మంది నా ప్రసంగాలను చూస్తారు. నా యూట్యూబ్ ఛానెల్ నుంచే నెలకు రూ.3 లక్షల ఆదాయం లభిస్తుంది’’ అని అన్నారు. చిన్నతనంలో పనిచేసేందుకు సుముఖత చూపేవాడిని కాదని, అప్పడే ఒకరి కింద పనిచేయకుండా.. నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని నిర్ణయించుకున్నట్లు గడ్కరీ చెప్పారు. నా తల్లిదండ్రులు నన్ను న్యాయ విద్య చదవాలని సూచించారు. కానీ, నేను వారికి నా లక్ష్యం గురించి స్పష్టంగా చెప్పాను. కులం, మతం, భాష ఆధారంగా వ్యక్తులు గొప్పవారు కారు. వ్యక్తిత్వం, లక్షణాలే వారి గొప్పతనాన్ని నిర్ణయిస్తాయి. నేను రాజకీయ నాయకుణ్ని. నాకు అన్ని వర్గాల వారి ఓట్లు కావాలి. అందుకే నేను కులం గురించి మాట్లాడను. అన్ని కులాల వారు నా కుటుంబ సభ్యులే, నాకు సోదరసమానులేనని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.