NTV Telugu Site icon

Parliament: లోక్‌సభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు.. ప్రవేశపెట్టిన అమిత్‌ షా

Parliament

Parliament

Parliament: ఢిల్లీ పరిపాలన సేవల నియంత్రణను లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు అప్పగించేలా కేంద్రం తీసుకుకొచ్చిన ఆర్డినెన్స్‌ స్థానంలో రూపొందించిన బిల్లును అధికార పక్షం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ స్థానంలో రూపొందించిన ‘ ది గవర్నమెంట్‌ ఆఫ్‌ నేషనల్‌ క్యాపిటల్‌ టెర్రిటొరీ ఆఫ్‌ ఢిల్లీ- 2023’ (The Government of National Capital Territory of Delhi Bill- 2023) బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఓవైపు మణిపూర్‌ అంశంలో ఉభయసభల్లోనూ ప్రతిష్టంభన కొనసాగుతుండగా.. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. ఢిల్లీకి సంబంధించిన ఏ చట్టాన్నైనా రూపొందించే అధికారాన్ని లోక్‌సభకు రాజ్యాంగం కల్పించిందని అన్నారు. అంతేకాకుండా చట్టాన్ని తీసుకొచ్చే అధికారం కేంద్రానికి ఉందని సుప్రీం కోర్టు కూడా గతంలో స్పష్టం చేసిందని చెప్పారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఢిల్లీ ప్రభుత్వం బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని.. ఈ బిల్లును తీసుకొచ్చేందుకు అనుమతించాలని స్పీకర్‌ను కోరారు.

Read also: Maddisetty Venugopal: కోట్లు సంపాందించాను.. చిల్లర పనులకు పాల్పడాల్సిన అవసరం లేదు..

బిల్లుపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ బిల్లును తీసుకురావడాన్ని సమాఖ్య విధానంపై దాడిగా కాంగ్రెస్‌ అభివర్ణించింది. ‘దిల్లీ సర్వీసెస్‌ బిల్లు’ అప్రజాస్వామికమని, సమాఖ్య విధానానికి విరుద్ధమని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లు రాజ్యాంగ విరుద్ధమని, సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించి ఈ బిల్లును తీసుకొచ్చారని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ అన్నారు. దేశంలో సమాఖ్య విధానంపై దాడి ఆమోదయోగ్యం కాదని, రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ) ఎంపీ మనోజ్ ఝా మండిపడ్డారు. ఇవాళ ఈ ఢిల్లీపై దాడి జరుగుతోందని, రేపు ఏ రాష్ట్రంలోనైనా జరగొచ్చని ఆయన వ్యాఖ్యానించారు. దేశ రాజధానిలోని పరిపాలన సేవలపై నియంత్రణను లెఫ్టినెంట్‌ గవర్నర్‌కి అప్పగించేలా కేంద్రం ఆర్డినెన్స్‌ తీసుకొచ్చినప్పటి నుంచి ఢిల్లీ ప్రభుత్వం దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ విపక్షాలను కూటగట్టే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ సహా పలు విపక్షపార్టీలు కేజ్రీవాల్‌కు మద్దతు తెలిపాయి. ఢిల్లీ పరిపాలన సేవల బిల్లు లోక్‌సభకు చేరిన నేపథ్యంలో ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఢిల్లీలో గ్రూపు-ఏ అధికారుల బదిలీలు, నియామకాలు, క్రమశిక్షణ చర్యలకు గాను ‘నేషనల్‌ కేపిటల్‌ సివిల్‌ సర్వీస్‌ అథారిటీ’ ఏర్పాటు చేయాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. ఆప్‌ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో.. డిల్లీలో ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలు, బదిలీలపై నియంత్రణాధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానిదేనని మే 11న తీర్పు వెలువడింది. ఆ నేపథ్యంలో అదే నెల 19న కేంద్రం ఆర్డినెన్సు జారీ చేసింది. ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతుండడంతో దానిని బిల్లు రూపంలో కేంద్రం ప్రవేశపెట్టింది.