NTV Telugu Site icon

Amit Shah: అంబేద్కర్‌ను గౌరవించింది మోడీ సర్కారే

Amitshah

Amitshah

భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. అమిత్ షా వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. అంబేద్కర్‌ను బీజేపీని అవమానపరుస్తోందని నినాదాలు చేశారు.

రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా అమిత్ షా ప్రసంగించారు. అంబేద్కర్ పేరు పెట్టుకోవడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిందంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు. అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్ అంటూ చెప్పుకోవడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయిందని.. ఇన్ని సార్లు దేవుడి పేరు తలుచుకున్నా.. స్వర్గంలో చోటు దక్కేదని అమిత్ షా అన్నారు. ఈ వ్యాఖ్యలే ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. బీజేపీ.. అంబేద్కర్‌ను అవమానిస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.

అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలు దుమారం చెలరేగడంతో బుధవారం అమిత్ షా మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు. అంబేద్కర్‌ను బీజేపీ ఎప్పుడూ అగౌరవపరచలేదన్నారు. మోడీ సర్కారే అంబేద్కర్‌ను గౌరవించిందని తెలిపారు. దళితుల రిజర్వేషన్లను మరింత బలోపేతం చేసింది బీజేపీనే అని చెప్పుకొచ్చారు. ఆ మాటికి వస్తే.. కాంగ్రెస్సే అంబేద్కర్‌ను అగౌరవపరిచిందని పేర్కొన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ హయాంలోనే దళితులపై దాడులు జరిగాయని వివరించారు. అంబేద్కర్‌ను పలుమార్లు అవమానించిందని.. రిజర్వేషన్లను కూడా కాంగ్రెస్ వ్యతిరేకించిందని ఆరోపించారు. తాను చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరిస్తోందని ధ్వజమెత్తారు. ఎమర్జెన్సీ విధించడం ద్వారా కాంగ్రెస్ రాజ్యాంగంలోని అన్ని విలువలను, ప్రజాస్వామ్య హక్కులను తుంగలో తొక్కిందని అమిత్ షా మండిపడ్డారు.

Show comments